చావు నుంచి తప్పించుకుని ఆత్మహత్య
Hamas: గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. బందీలుగా ఉన్నవారిలో పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఉంది. దక్షిణ ఇజ్రాయెల్‌కి చెందిన షిరేల్ గోరెన్ 2023 అక్టోబర్ 7న సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కి వెళ్లింది. ఆ సమయంలోనే హమాస్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఎంతో మందిని కిడ్నాప్ చేసి బందీలుగా చేసుకున్నారు. వారిలో షిరేల్ ఒకరు.
కానీ ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని గాయాలతో ఇంటికి చేరుకుంది. ఈ ఘటన తర్వాత షిరేల్ వణికిపోయింది. ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. స్నేహితులను కలిసేది కాదు. తన గదిలో నుంచి కూడా బయటికి వచ్చేది కాదని షిరేల్ తల్లిదండ్రులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న షిరేల్ 22వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. హమాస్ చెర నుంచి తప్పించుకుని బయటపడిన షిరేల్‌కు 22వ పుట్టినరోజు పునర్జమ్మలాంటిది. కానీ ఆ అమ్మాయి అలా అనుకోలేదు. హమాస్ దాడి కారణంగా తనలో పుట్టిన భయం చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. తన పుట్టినరోజు నాడే షిరేల్ నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలీక పాపం షిరేల్ తల్లిదండ్రులు గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి ఏర్పాటుచేసుకున్నారట. పుట్టినరోజు నాడే తమ బిడ్డ దూరం కావడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.