Sajjala: నాలుగేళ్లు పోనీండి.. చూసుకుంటాం
Sajjala: తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉందని ఆరోపిస్తూ మంగళగిరి రూరల్ పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో సజ్జలను రెండు గంటల పాటు విచారించి పంపించారు. విచారణ అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
“” ఆ దాడులు జరిగినప్పుడు నేను అసలు లేను. బద్వేల్లో పార్టీ కార్యాచరణ చూస్తున్నాను. నేను లేను మొర్రో అని ఆధారాలు చూపించినా పోలీసులు మీరు ఉన్నట్లు తెలుస్తోంది అని కథలు రాసుకున్నారు. అలాంటివారితో ఏం మాట్లాడతాం. ఆ రోజు తెలుగు దేశం పార్టీ ప్రతినిధి పట్టాభి జగన్ మోహన్ రెడ్డిని అనకూడని మాట అన్నారు. ఏదో ఒకసారి అన్నారు అంటే కోపంలో అన్నారు అనుకోవచ్చు. కానీ రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే పలుమార్లు అన్నారు. అలా అంటే పార్టీ నేతలకు, కార్యకర్తలకు కోపం రాదా? అందుకే ఏమన్నా దాడి చేసారేమో.
ఒకవేళ దాడి చేసి ఉంటే యాక్షన్ తీసుకోండి. ఎవ్వరూ వద్దనరు. కానీ సంబంధం లేని వారిపై తప్పుడు కేసులు పెట్టడమంటే మాలో కసిని పెంచడమే అవుతుంది. ప్రతిపక్షం అనేది లేకుండా చూడాలని తెలుగు దేశం పార్టీ ప్లాన్ వేస్తోంది. అది కుదరక తప్పుడు కేసుల్లో ఇరికించి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటోంది. మీరు ఇలా చేస్తుంటే నాలుగేళ్ల పోయ్యాక చూసుకుందాంలే అనే ధోరణి మాలో కూడా కలుగుతుంది. అంతకు మించి ఏమీ లేదు“” అని తెలిపారు.