మంగళగిరి పోలీస్ స్టేషన్కు సజ్జల.. 25 ప్రశ్నలతో రెడీగా పోలీసులు
Sajjala: వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీస్టే స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో భాగంగా ఈరోజు సజ్జలను విచారించనున్నారు. కేంద్ర కార్యాలయంపై సజ్జల రౌడీ మూకలను రెచ్చగొట్టి ఉసిగొల్పారని ఆరోపణలు ఉండటంతో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. సజ్జల ఆదేశించినట్లుగానే రౌడీ మూకలు దాడి చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సజ్జలతో పాటు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్, బ్రహ్మారెడ్డిలు కూడా ఉన్నారు. కానీ ఆ ఇద్దరు న్యాయవాదులను మాత్రం లోనికి అనుమతించలేదు. ఆ న్యాయవాదులు లోపలికి వెళ్లిపోతుండగా.. మేం సజ్జలను పిలిస్తే మీరెందుకు వచ్చారు అని పోలీసులు వాదనలకు దిగారు. పోలీసులు కావాలనే తమను ఆపేసారని పొన్నవోలు మీడియాకు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో ఉద్రికత్త నెలకొంది.
డీఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 25 ప్రశ్నలు రెడీ చేసుకున్నారు. ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ వారి నుంచి సరైన సమాధానాలు మాత్రం రాబట్టలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. విచారణకు పిలిచి రెండు గంటలకోసారి టీ బ్రేక్ తీసుకుంటున్నారని కూడా అంటున్నారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాంను ప్రశ్నించారు. ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురావడానికి కీలక వ్యక్తులను కూడా పిలిచి విచారణ చేపడుతున్నారు. ఆ కీలక వ్యక్తుల్లో సజ్జల ఒకరని పోలీసులు అనుమానిస్తున్నారు.