అమ్మ కొనిచ్చిన బైక్.. ప్లీజ్ ఇచ్చేయండి
Pune: పై ఫోటోలో కనిపిస్తున్న యువకుడిని చూసారా. పాపం దసరా రోజున తన బైక్‌ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారట. పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఇలా కార్డ్‌బోర్డుపై రాసి ఊరంతా తిరుగుతున్నాడు. పుణెకి చెందిన అభిమన్యుకి రెండేళ్ల క్రితం తన తల్లి ఎంతో కష్టపడి ఒక యాక్టివా స్కూటీ కొనిచ్చిందట. అది స్థానిక కోత్రుడ్ ప్రాంతం నుంచి దసరా రోజున పోయిందట. ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు అంత సీరియస్‌గా తీసుకోలేదేమో..! పాపం ఇలా ఓ ప్లాకార్డు పట్టుకుని స్థానిక గల్లీల్లో తిరుగుతున్నాడు. నా స్కూటీ పోయింది. అది మా అమ్మ ఎంతో కష్టపడి ఇచ్చిన కానుక. నాకు అమ్మ జ్ఞాపకంగా మిగిలింది అదొక్కటే. దయచేసి దానిని ఎవరు తీసుకున్నా ఇచ్చేయండి. నేను పోలీసులకు కూడా చెప్పను. ఎవరికైనా ఈ వివరాలతో ఉన్న స్కూటీ కనిపిస్తే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు అని ప్లకార్డుపై రాసి తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతున్న అభిమన్యు ఫోటోని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. త్వరగా ఆ అబ్బాయికి తన తల్లి ఇచ్చిన కానుక తిరిగి రావాలని ఆశిద్దాం.