నలుగురిని ప్రేమించి ఒక్కరినీ పెళ్లి చేసుకోని రతన్
Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన జీవితంలో పెళ్లి అనే మాటే ఎరుగరు. కానీ ఆయన జీవితంలో ప్రేమకు మాత్రం చోటు దక్కింది. ఆయన నలుగురితో ప్రేమలో పడ్డారు. కానీ ఏ ఒక్కరినీ పెళ్లి చేసుకోలేకపోయారు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. రతన్ లాస్ ఏంజిల్స్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడి అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారు. కానీ ఆమెతో పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయారు. ఎందుకంటే ఆ సమయంలో రతన్ అమ్మమ్మకి ఒంట్లో బాలేకపోవడంతో ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇండియా వచ్చేసారు.
ఆ తర్వాత మళ్లీ తన ఇష్టసఖిని కలుసుకుని పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఇండో చైనా యుద్ధం జరుగుతోంది. దాంతో ఆమెను పెళ్లి చేసుకుని ఇండియా తీసుకురాలేని పరిస్థితి. దాంతో ఆమె అమెరికాలోనే వేరే వ్యక్తిని పెళ్లి చేసేసుకున్నారు. ఆ అమ్మాయి తర్వాత మరో ముగ్గురు యువతులను ఇష్టపడ్డాను కానీ ఏ ఒక్కరినీ పెళ్లి చేసుకోలేకపోయానని.. పరిస్థితులు అనుకూలించలేదని స్వయంగా రతనే ఈ మాటను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జీవితంలో తాను పెళ్లి చేసుకోకపోవడం కూడా తన మంచికే జరిగిందని.. ఒకవేళ చేసుకుని ఉంటే జీవితం కఠినంగా మారేదేమో అనుకుంటూ ఉంటానని అన్నారు.
సిమి గరేవాల్‌తో ప్రేమాయణం
బాలీవుడ్ సీనియర్ నటి సిమి గరేవాల్‌ను రతన్ ఒకప్పుడు డేటింగ్ చేసారనే టాక్ ఉంది. కొన్నేళ్ల క్రితం సిమి గరేవాల్ రతన్ టాటాను ఇంటర్వ్యూ కూడా చేసారు. రతన్ చనిపోయారని తెలిసి గుడ్ బై మై డియర్ ఫ్రెండ్ అని సిమి భావోద్వేగంతో నివాళులు అర్పించారు.