Mehul choksi: వజ్రాల వ్యాపారికి ఊరట
Delhi: ప్రముఖ వజ్రాల వ్యాపారి మేహుల్ చోక్సీ(mehul choksi)కి ఊరట లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో(PNB) 13వేల కోట్ల దోపిడీ కేసులో భారత్(India)లో వాంటెడ్‌గా ఉన్న మేహుల్(mehul).. తన మోసం బయటపడకముందే ఇండియా వదిలి కరీబియన్ దేశం అయిన ఆంటీగ్వాకు పారిపోయాడు. అప్పటినుంచి CBI అధికారులు ఆయన్ను ఇండియాకు రప్పించి అరెస్ట్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 మేలో ఇంటర్‌పోల్ అధికారులు మేహుల్‌ను ఇన్వెస్టిగేషన్ కోసం బలవంతంగా ఆంటీగ్వా నుంచి తీసుకెళ్లారు. తన అనుమతి లేకుండా ఆంటీగ్వా, బార్బుడా సరిహద్దులను దాటించకూడదని, ఇన్వెస్టిగేషన్ పేరుతో తన పట్ల దారుణంగా ప్రవర్తించే సూచనలు ఉన్నాయని మేహుల్ ఆంటీగ్వా హైకోర్ట్‌లో పిటిషన్ వేసాడు.
వాదోపవాదాల తర్వాత కోర్టు తీర్పు మేహుల్‌కు అనుకూలంగా వచ్చింది. మేహుల్‌ను బలవంతంగా ఆంటీగ్వా, బార్బుడా నుంచి తీసుకెళ్లడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అన్నప్పుడు హైకోర్టు అనుమతి తీసుకున్నాకే ఆయన్ను తీసుకెళ్లచ్చని తెలిపింది. అంతేకాదు.. కొన్ని రోజుల క్రితమే ఇంటర్‌పోల్ అధికారులు మేహుల్పై ఉన్న రెడ్ నోటీస్‌ను వెనక్కి తీసుకున్నారు. దాంతో భారత సీబీఐ అధికారులు రెడ్ నోటీస్‌ను వెనక్కి తీస్కోవడంపై అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మేహుల్పై రెడ్ నోటీస్ లేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం లేకుండా ఆయనకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి రావచ్చు.