Prakash Raj: సడెన్‌గా ఆయన మీద ఎందుకంత ప్రేమ పవన్?
Prakash Raj: దివంగత నేత MGR గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్ వేసారు. AIADMK పార్టీ పెట్టి 53 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎంజీఆర్, జయలలితలను గుర్తుచేసుకుంటూ వారు రాబోయే తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారని ట్వీట్ చేసారు. దీనిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. MGRపై హఠాత్తుగా ఎందుకింత ప్రేమో.. పై నుంచి ఆదేశాలు అందాయా.. జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైర్ వేసారు.
ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. పవన్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ప్రకాష్ రాజ్ ఆయనకే మద్దతు తెలిపేవారు. కానీ పవన్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం ప్రకాష్ రాజ్‌కు నచ్చలేదు. అదీకాకుండా తిరుమల లడ్డూ విషయంలో వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంతలా గొడవ రాజుకుంది. లడ్డూ విషయంలో విచారణ చేయించకుండా మత కల్లోలాలు సృష్టించేలా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ప్రకాష్ రాజ్ పవన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం పవన్‌కు నచ్చలేదు.
దాంతో సనాతన ధర్మం గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోను ప్రకాష్ రాజ్ అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక ఒకలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చేయని తప్పుకి ఎందుకు అడిగి మరీ క్షమాపణలు చెప్పించుకుంటున్నారు అంటూ ప్రకాష్ రాజ్ పవన్‌ను ప్రశ్నించారు. అలా ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు పవన్‌ను ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు.