లోన్ తీసుకుని తండ్రి హత్యపై పగ తీర్చుకుని
Father: 8 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడం కళ్లారా చూసాడు. తండ్రికి సహజ మరణం కాదు.. హత్య అని తెలుసుకున్నాడు. హత్య చేసిన నిందితులను కోర్టు శిక్షించింది. కానీ ఆ శిక్ష చాలదు అనుకున్నాడు. తన తండ్రికి పట్టిన గతే వారికీ పట్టాలని 22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్నాడు ఓ యువకుడు.
ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 2002లో జైసల్మేర్‌కి చెందిన హరి సింగ్ అనే వ్యక్తిని అతని సోదరుడు నఖత్ సింగ్ మరో నలుగురు సోదరులతో కలిసి దారుణంగా ట్రక్కుతో గుద్ది చంపేసాడు. ఆ తర్వాత నిందితులను పోలీసులు అదుపులో తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా.. నఖత్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయటికి వచ్చాక నఖత్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటున్నాడు. హరి సింగ్ కొడుకు గోపాల్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఎనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచే తన తండ్రిని చంపినవారి అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నఖత్‌పై కన్నేసాడు. అతను రోజూ సైకిల్ మీద పనికి వెళ్తుంటాడని తెలుసుకున్నాడు.
వారం రోజుల పాటు ప్లాన్ వేసి రూ.1.2 లక్షల డౌన్ పేమెంట్ కట్టి మరో 8 లక్షలు అప్పు తీసుకుని మరీ ఒక ట్రక్కు కొనుక్కున్నాడు. రెండు రోజుల క్రితం నఖత్ సైకిల్‌పై వెళ్తుండగా.. గోపాల్ అతన్ని ట్రక్కుతో ఢీకొన్నాడు. ముందు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు కానీ.. సీసీ కెమెరా చూడగా కావాలనే చేసినట్లు అనుమానం వచ్చింది. నిందితుడు గోపాల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా.. 22 ఏళ్ల క్రితం నఖత్ తన తండ్రిని చంపాడని.. ఆ కోపంతో తానే నఖత్‌ను యాక్సిడెంట్ చేసి చంపేసానని ఒప్పుకున్నాడు.