పవన్ నిర్ణయాలు.. TDPలో గుబులు
TDP: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవ్వరూ ఊహించిని విధంగా జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచింది. అందుకే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. కూటమి అన్నాక అన్ని పార్టీల అధినేతలు కలిసి చర్చించుకుని ఒకే నిర్ణయంపై నిలబడాలి. ఎన్నికల ముందు వరకు కూటమిలో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది.
తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా దీనిపై తెగ చర్చ జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం తిరుమల లడ్డూ విషయంలో చేసిన తప్పు గురించి ప్రజలకు తెలియజేయాలనుకోవడం. కానీ దీనిని మరోలా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ ధ్వజమెత్తారు. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆ తర్వాత తిరుమలలో డిక్లరేషన్ పేరిట వారాహి సభను ఏర్పాటు చేసారు.
ఈ సభలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు ఉన్నారే తప్ప తెలుగు దేశం వారు కనిపించలేదు. దీనిని బట్టి చూస్తేనే అర్థమవుతోంది ఈ డిక్లరేషన్ సభ, సనాతన ధర్మంపై పోరాటం అనే విషయాల్లో తెలుగు దేశం పార్టీ హస్తం లేదని. పవన్ తిరుమల లడ్డూ గురించి మాట్లాడతారు అనుకుంటే అది కాస్తా ఎటో పోయింది. దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొత్త గుబులు మొదలైంది. అదేంటంటే.. పవన్ సనాతన ధర్మం పేరిట కేవలం హిందువుల గురించి మాట్లాడుతుంటే క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ వర్గాల మద్దతు ఇక తమ పార్టీకి ఉండదేమో అని.
ఆల్రెడీ ఇదే అంశంపై నిన్న APCC చీఫ్ వైఎస్ షర్మిళ ప్రస్తావించారు. అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ మారిపోయారని.. తిరుమల లడ్డూ విషయం గురించి మాట్లాడమంటే ఆర్ఎస్ఎస్ ఏజెంట్‌లా ప్రవర్తిస్తూ ఇతర మతాల వారిలో అభద్రతా భావాన్ని నింపుతున్నారని అభిప్రాయపడ్డారు.