కూతురు సెక్స్ రాకెట్‌లో దొరికింద‌ని స్కాం కాల్.. గుండెపోటుతో తల్లి మృతి

mother gets a scam call about daughter dies of heart attack

Viral News: రోజులో ఎంద‌రి కొన్ని వంద‌ల వేల స్కాం కాల్స్ వస్తుంటాయి. ట్రూ కాల‌ర్ పుణ్య‌మా అని కొన్ని ముందే పసిగ‌ట్టి వాటి నుంచి త‌ప్పించుకుంటున్నాం. కానీ పాపం కొంద‌రు ఫోన్లు స‌రిగ్గా వాడ‌టం రాక ఈ స్కాం కాల్స్‌ని న‌మ్మేసి మోస‌పోతున్నారు. ఇలాంటి స్కాం కాల్స్ వ‌ల్ల ఆర్థిక న‌ష్టం జ‌రిగిన‌ట్లు చాలానే విన్నాం కానీ తొలిసారి ప్రాణ న‌ష్టం జ‌రిగింది.

ఆగ్రాకి చెందిన మాల‌తీ వ‌ర్మ అనే మ‌హిళ‌కు నిన్న ఓ స్కాం కాల్ వ‌చ్చింది. ఈమె ప్ర‌భుత్వ టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. నిన్న స్కూల్‌లో ఉండ‌గానే మాల‌తికి ఓ నెంబ‌ర్ నుంచి వాట్సాప్ కాల్ వ‌చ్చింది. ఆ వాట్సాప్ ఫోటోలో ఫేక్ పోలీస్ అధికారి ఫోటో ఉంది. దాంతో కంగారుగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. నీ కూతురు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుంది. ఆమె క్షేమంగా ఇంటికి రావ‌లంటే చెప్పిన ఖాతాలో రూ.1 ల‌క్ష ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి అని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.

అది విని మాల‌తి భ‌య‌ప‌డిపోయింది. వెంట‌నే త‌న కుమారుడికి కాల్ చేసి విష‌యం చెప్పింది. అత‌ను నెంబ‌ర్ పంప‌మ‌ని అడ‌గ్గా. మాల‌తి పంపింది. అది మ‌న భార‌తీయ కోడ్ +91 కాకుండా +92 ఉండ‌టంతో స్కాం కాల్ అని మాల‌తి కుమారుడు చెప్పాడు. స్కాం అని చెప్పిన త‌ర్వాత కూడా మాల‌తి త‌న కూతురి విష‌యంలో భ‌య‌ప‌డుతూ అనారోగ్యం పాలైంది. స్కూల్ నుంచి ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత ఛాతిలో నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో నీళ్లు ఇచ్చారు. నీళ్లు తాగిన కొద్ది సేప‌టికే మాలతి చ‌నిపోయింది. వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా ఆమె గుండెపోటుతో చనిపోయార‌ని వైద్యులు నిర్ధారించారు. వెంట‌నే మాలతి కొడుకు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఓ ఫేక్ కాల్ ఓ అబ‌ద్ధం వ‌ల్ల పాపం ఆ త‌ల్లి గుండె ఆగిపోయింది.