Tom Moody: 18 కోట్లు పెట్టి పాండ్య‌ను కొనేంత‌ సీన్ లేదు

tom moody comments on hardik pandya retention

Tom Moody: IPL 2025 వేలానికి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. ఐపీఎల్‌లో మొత్తం 10 టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీం ఆరుగురు ఆట‌గాళ్ల‌ను రీటైన్ చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ రిటెన్ష‌న్ ప్ర‌క్రియ రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి డైరెక్ట్ రిటెన్ష‌న్. మ‌రొక‌టి రైట్ టు మ్యాచ్ (RTM) రిటెన్ష‌న్. టీం ఓన‌ర్లు ఈ రెండింటినీ కాంబినేష‌న్లుగా వాడుకోవచ్చు. అయితే ఒక్కో టీం మ్యాగ్జిమం ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆట‌గాళ్ల‌ను (స్వ‌దేశీ, విదేశీ) ఇద్ద‌రు అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ల‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంది. ఒక్కో టీంకి కేటాయించిన బ‌డ్జెట్ రూ.120 కోట్లు. మొత్తం ఆరుగురు ఆట‌గాళ్ల‌ను రీటైన్ చేసుకోవాల‌న్న‌ప్పుడు ఒక ఆట‌గాడికి రూ.18 కోట్లు, ఇద్ద‌రికి రూ.14 కోట్లు, ఒక‌రికి రూ.11 కోట్లు ఇచ్చి త‌మ టీంలో పెట్టుకుంటారు.

అయితే ఇప్పుడు క‌ళ్ల‌న్నీ ముంబై ఇండియ‌న్స్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కి ఆట మొత్తం పీడ‌క‌ల లాగే సాగింది. ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై.. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి ఎగ్జిట్ అయిన తొలి టీం కావ‌డం షాకింగ్ అంశం. అదీకాకుండా ఎప్ప‌టినుంచో రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌గా ఉండ‌గా.. ఈసారి అత‌న్ని ఆట‌గాడిగా పెట్టి హార్దిక్ పాండ్య‌ను కెప్టెన్‌గా చేసారు. కానీ హార్దిక్ మాత్రం పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఎన్నో ట్రోల్స్, అవ‌మానాలు ఎదుర్కొన్నాడు. ఈ నేప‌థ్యంలో పాండ్య‌ను కెప్టెన్‌గా రీటైన్ చేస్తారా లేదా అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మాజీ ఐపీఎల్ కోచ్ టామ్ మూడీ స్పందిస్తూ.. రూ.18 కోట్లు పెట్టి హార్దిక్ పాండ్య‌ను కొనేంత సీన్ లేద‌ని అన్నాడు. అంత డ‌బ్బు పెట్టి కొనాల‌నుకుంటే జ‌స్ప్రీత్ బుమ్రా, సూర్య‌కుమార్ యాద‌వ్‌ల‌ను కొనుగోలు చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తంలో ఇషాన్ కిష‌న్, జోఫ్రా ఆర్చ‌ర్‌ల‌ను ఎక్కువ డ‌బ్బుకు కొంటే వారి ఆట పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేద‌ని అన్నారు. కాబ‌ట్టి ఈసారి ముంబై ఇండియ‌న్స్ ఆచి తూచి నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.