Pawan Kalyan: లడ్డూ విషయంలో జగన్‌ది తప్పు అని నేను అనలేదు
Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిది తప్పు అని తాను ఆన్ రికార్డు కానీ ఆఫ్ రికార్డు కానీ ఎప్పుడూ చెప్పలేదని.. ఇప్పటికీ తాను ఈ మాట మీదే ఉంటానని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈరోజు తిరుమలలో ఆయన డిక్లరేషన్ పేరిట వారాహి సభను ఏర్పాటుచేసారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. తనను తన కుటుంబాన్ని దారుణంగా ధూషించినా ఏమీ అనలేదు కానీ సనాతన ధర్మాన్ని తప్పుగా చూపిస్తే మాత్రం తాట తీస్తానని అన్నారు.
“” మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. ఇస్లాం, క్రైస్తవ, సిఖ్ మరియు అన్యమతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద ఎవరైనా దాడి చేసినా, అపహాస్యం చేసినా, దూషించినా… ప్రాణాలోడ్డయిన సరే మన ధర్మాన్ని శాయశక్తులా రక్షించుకుందాం. దేవుని ఆశీసులు తీసుకుని చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని మీరు ఎవరు ఏమి చేయలేరు గుర్తుంచుకోండి ఉదయనిధి స్టాలిన్. మీలాంటి వారు వస్తారు, పోతారు, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. భారత సనాతన ధర్మాన్ని అంతం చేయాలి అనుకోవడం ఒక కొండని ఉలి దెబ్బతో కూల్చేయాలి అనుకోవడమే. జగన్ ఈరోజు అమాయకుడిలా నటిస్తున్నాడు, గత 5 సంవత్సరాల్లో అతను చేసిన పనులు, గతంలో అతనిపై ఉన్న అవినీతి కేసులు గుర్తు చేసుకోవాలని జాతీయ మీడియాకు కూడా అభ్యర్ధిస్తున్నాను.
ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి. సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి“” అని సభలో ప్రసంగించారు పవన్