Mars: మార్స్… మ మ మార్స్..!
Mars: ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు అంగారకుడిపై మానవ మనుగడ ఉంటుందా లేదా అనే దానిపై పరిశోధనలు చేయడంలో మునిగిపోయారు. ముఖ్యంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం 2040 నాటికి మార్స్‌పై తనకు పుట్టిన పిల్లలు అడుగుపెట్టాలని తెగ ప్రయత్నాలు చేసేస్తున్నాడు. అయితే.. తాజా పరిశోధనలు చూస్తే మార్స్‌పై అడుగుపెట్టాలంటే భయపడేలా ఉన్నాయ్. ఎందుకంటే మార్స్‌పై మనిషి అడుగుపెడితే శరీరమంతా పచ్చగా కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయట.
అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు మానవ మనుగడకు అనుకూలంగా లేవు. అక్కడ గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం, రక్షణనిచ్చే ఓజోన్ పొర లేకపోవడం ప్రధాన సమస్యలు. వీటి వల్ల అత్యధిక రేడియేషన్, UV కిరణాలు, కాస్మిక్ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనిషి చావడానికి రేడియేషన్ కీలకమైనది. అలాంటిది అత్యధిక రేడియేషన్, UV కిరణాలు, కాస్మిక్ కిరణాలు మనిషిపై పడితే ఇక అంతే సంగతులు.
అమెరికాలోని రైస్ యూనివర్సిటీకి చెందిన స్కాట్ సోలోమాన్ అనే బయాలజిస్ట్ ఈ పరిశోధనలను బయటపెట్టారు. మార్స్‌పై మనిషి బతకాలంటే అందుకు తగినట్లుగా జన్యువుల్లో మార్పిడి జరగాలి. ఈ ప్రక్రియలో అధిక రేడియేషన్ శరీరంపై ప్రభావం చూపకుండా శరీరమంతా పచ్చగా మారిపోతుందట. భూమితో పోలిస్తే అంగారకుడిపై 30 శాతం తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. దీని వల్ల ఎముకలు, కండరాలు బలహీనపడిపోతాయి. సమయాన్ని బట్టి కంటి చూపులో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి. అలా క్రమంగా కళ్లు పసుపు రంగులోకి మారిపోయే అవకాశం ఉందని స్కాట్ తెలిపారు.
తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉండటం వల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. దీని వల్ల పిల్లలు కలిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎముకలు దృఢంగా లేకపోతే జననాంగం చుట్టూ ఉండే ఎముకలు విరిగిపోతాయి. 2030 నాటికి నాసా మనుషులను మార్స్‌పైకి పంపాలని యత్నిస్తోంది. మరో 30 ఏళ్లలో మార్స్‌పై మనుషులు ఉండేలా కాలనీ ఏర్పడబోతోందని.. ఇందుకోసం తాను మరింత మంది పిల్లల్ని కని వారిని మార్స్‌పై పెరిగి పెద్దయ్యేలా చేయాలనుకుంటున్నట్లు ఆల్రెడీ ప్రకటించేసారు. మొత్తానికి అంగారకుడిపైకి మనిషి వెళ్లాలంటే మాత్రం భూమిపై ఉన్నట్లుగా జీవిస్తే కుదరదు. ఆ గ్రహం వేరు కాబట్టి అక్కడి వాతావరణాన్ని బట్టి మనిషిని మార్చేస్తుంది. దీనిని మనిషి తట్టుకుని నిలబడగలడా అనేది పెద్ద ప్రశ్న.