JR NTR: దర్శకుల పాలిట “దేవర”
JR NTR: ఒక సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యిందంటే ఆ దర్శకుడిని అదే హీరోతో మరో సినిమా చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తారు. డైనమిక్ డైరెక్టర్ అంటూ ఆకాశానికెత్తేస్తారు. అదే సినిమా ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం ఇంకోసారి అవకాశం ఇవ్వడానికి అటు హీరో కానీ ఇటు నిర్మాత కానీ రిస్క్ చేయాలని అనుకోరు. అలా ట్రాక్ తప్పి ఫ్లాప్స్ చవిచూసిన ఎందరో దర్శకులు మన టాలీవుడ్‌లో ఉన్నారు. వారందరికీ మళ్లీ పునర్జమ్మనిచ్చింది జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి. అప్పటిదాకా బ్లాక్‌బస్టర్లు తీసిన దర్శకులకు సడెన్‌గా ఫ్లాప్ పడి డీలా పడిపోతే.. తన సినిమాతో మళ్లీ వారిని ట్రాక్‌లో పడేసాడు తారక్.
కొరటాల శివ
సోది లేకుండా మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీస్తారన్న పేరు కొరటాల శివకు ఉంది. జనతా గ్యారేట్, భరత్ అనే నేను వంటి సినిమాలు అవే కోవకు చెందుతాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అప్పటివరకు హిట్ల పర్వంతో టాలీవుడ్‌లో దూసుకెళ్లిన కొరటాల శివకు ఆచార్య పెద్ద గుణపాఠం నేర్పింది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వంటి హీరోలు ఉన్న ఆచార్య ఫ్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆచార్య ఫ్లాప్ అయ్యిందని తెలిసి చిరంజీవి ఎంతో బాధపడ్డారు. వెంటనే శివకు ఫోన్ చేసి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతావు అని ధైర్యం చెప్పారు. అలా దేవరతో శివ బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పాలి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కావడంతో తారక్ నుంచి సోలో సినిమా కోసం ఫ్యాగ్స్ పడికాపులు కాసారు. వారి అభిరుచులకు తగ్గట్టుగానే దేవరను తీసారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ రకంగా చూసుకుంటే ఆచార్యతో డీలాపడిపోయిన కొరటాల శివకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది తారకే.
త్రివిక్రమ్ శ్రీనివాస్
JR NTR: త్రివిక్రమ్ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. సినిమా ఫ్లాప్ అయినా ఏదో ఒక రకంగా ఆడేస్తుంది. అజ్ఞాతవాసి అదే కోవకు వస్తుంది. పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అజ్ఞాతవాసి తీసి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ పవన్ ఫ్యాన్‌డం ముందు ఆ సినిమా కూడా గట్టెక్కింది. కానీ గట్టెక్కే సినిమాలు తీస్తే టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేరు. త్రివిక్రమ్ లాంటి వారు అసలు ఉండలేరు. అలాంటి త్రివిక్రమ్‌ను అరవిందసమేత వీరరాఘవ సినిమాతో మళ్లీ పైకి లేపింది తారకే.
పూరీ జగన్నాథ్
అప్పటివరకు ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్‌నే కాదు తనని తాను ట్రాక్‌లో పడేసుకున్నారు తారక్. టెంపర్ సినిమా వీరిద్దరి కాంబోలో మ్యాజిక్‌లా పనిచేసింది. అప్పటివరకు శక్తి, దమ్ము, కంత్రి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చవిచూసారు తారక్. మరోపక్క పూరీ జగన్నాథ్ కూడా సరైన సినిమాలు లేక సతమతమవుతుంటే టెంపర్‌తో ఇద్దరూ టీమప్ అయ్యారు. అలా ఈ సినిమా ఇద్దరికీ మాంచి కిక్ ఇచ్చింది.
సుకుమార్
JR NTR: నేనొక్కడినే ఫ్లాప్ అవడంతో సుకుమార్ చాలా బాధపడ్డారు. మహేష్ బాబుని పెట్టి సినిమా తీస్తే ఇలాంటి రిజల్ట్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దాంతో సుకుమార్‌ని నాన్నకు ప్రేమతో సినిమాతో పైకి లేపారు తారక్.
కేఎస్ రవీంద్ర (బాబీ)
గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాన్ చేసారు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. బ్లాక్‌బస్టర్ అంటే గబ్బర్ సింగ్.. డిజాస్టర్ అంటే సర్దార్ గబ్బర్ సింగ్ అనేంతగా సినిమా బాక్సాఫీస్ దగ్గర డీలా పడిపోయింది. అలా ఫ్లాప్‌తో బాధపడుతున్న బాబీకి జైలవకుశతో మైలేజ్ ఇచ్చారు తారక్. ఇలా ఫ్లాప్‌లతో సతమతమైన దర్శకులకు తారక్ దేవర అనే చెప్పాలి కదా..!