High Court: కూతురికి పెళ్లి చేసి ఆడ‌వాళ్ల‌ను స‌న్యాసం తీసుకోమంటావా?

madras high court slams sadhguru jaggi vasudev

High Court: మ‌ద్రాస్ హైకోర్టు ఇషా ఫౌండేష‌న్ అధినేత‌, ఆధ్యాత్మికవేత్త స‌ద్గురు జగ్గీ వాసుదేవ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నీ కూతురికి పెళ్లి చేసావ్. మ‌రి ఇత‌ర ఆడ‌వాళ్ల‌ను గుండు చేయించుకోండి స‌న్యాసం తీసుకోండి అని ఎందుకు చెప్తున్నారు అని ప్ర‌శ్నించింది. త‌మిళ‌నాడు అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న కామ‌రాజ్ అనే వ్య‌క్తి మ‌ద్రాస్ హైకోర్టులో స‌ద్గురుపై పిటిష‌న్ వేసారు. కామ‌రాజ్ ఇద్ద‌రు కూతుళ్లు రెండు నెల‌ల క్రితం ఇషా ఫౌండేష‌న్‌కు వెళ్లి వ‌స్తామ‌ని చెప్పి ఇక ఇళ్ల‌కు రాము పెళ్లి చేసుకోము ఇషా ఫౌండేష‌న్‌లోనే ఉండిపోతాం అని చెప్పార‌ట‌. దాంతో కామ‌రాజ్ స‌ద్గురు త‌న బిడ్డ‌ల‌ను స‌న్యాసం తీసుకోవాల‌ని నూరిపోసార‌ని ఆరోపిస్తూ కోర్టులో పిటిష‌న్ వేసారు.

ఈ పిటిష‌న్‌పై జ‌స్టిస్ సుబ్ర‌హ్మ‌ణ్యం, సివ‌గ్నానంలు ప‌రిశీలించారు. కేసులోని వాదోప‌వాదాలు విన్న న్యాయమూర్తులు స‌ద్గురుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. స‌ద్గురు కూతురు రాధేకి పెళ్లి చేసారు. ఇత‌ర ఆడ‌వాళ్ల‌ను స‌న్యాసం తీసుకోండి గుండ్లు చేయించుకోండి అని బోధిస్తున్నారు. ఇదేం విడ్డూరం అని ప్ర‌శ్నించారు. దీనిపై వెంట‌నే లోతుగా విచారించాల‌ని.. ఇషా ఫౌండేష‌న్‌లో ఇంకా ఎంత మంది యువ‌తీ యువ‌కులు ఏళ్ల త‌ర‌బ‌డి ఉంటున్నారో లిస్ట్ ప్రిపేర్ చేసి స‌బ్మిట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసారు.

దీనిపై ఇషా ఫౌండేష‌న్ స్పందించింది. ల‌క్ష‌లాది మంది త‌మ ఫౌండేష‌న్‌కి వ‌చ్చిపోతుంటారని.. కొంద‌రు మాత్రం శివ‌య్య‌కు సేవ చేసుకుంటూ అక్క‌డే ఉండిపోతార‌ని అన్నారు. ఉండాలా వ‌ద్దా అనేది వారి ఇష్ట‌మే అని.. తాము ఎవ్వ‌రినీ బ‌ల‌వంతంగా ఉంచ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసారు.