Rajnath Singh: పాకిస్థాన్‌కు భారతే ఎక్కువ నిధులు ఇవ్వగలదు
Rajnath Singh: భారత్‌తో పాకిస్థాన్ సత్సంబంధాలు బాగుండి ఉంటే అంతర్జాతీయ సహాయక నిధి (IMF) ఇచ్చిన దానికంటే భారత్ ఎక్కువ నిధులను పాకిస్థాన్‌కు ఇచ్చేదని అన్నారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇటీవల అంతర్జాతీయ సహాయక నిధి పాకిస్థాన్‌కు 70 వేల కోట్ల రూపాయలను ఫండ్‌గా ఇచ్చింది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తర కశ్మీర్‌లోని బందిపోరా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం భారత్ 90 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని.. ఇది పాకిస్థాన్‌కు IMF ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తం అని అన్నారు. ఇప్పుడు పాకిస్థాన్‌కు ఇచ్చిన ఫండ్స్‌తో పాక్ కచ్చితంగా ఉగ్రవాదాన్నే మెరుగుపరుచుకుంటుందని ఆరోపించారు.
ఇప్పుడు పాక్ ఆర్థికంగా నష్టాల్లో ఉందంటే దానికి కారణం ఉగ్రవాదమే అని అది ఈ జన్మకు పాకిస్థాన్‌కు అర్థంకాదని విమర్శలు గుప్పించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంటున్న వారంతా భారత్‌కు వచ్చేయాలని.. భారత్ వారిని కూడా భారతీయులుగానే కంటికి రెప్పలా చూసుకుంటుందని పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తుందంటే.. ఆ అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉంటున్నవారు కూడా భారత్‌లో స్థిరపడతారని అన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే కొద్దీ భారత్ పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదని ఈ సందర్భంగా హెచ్చరించారు.