Temples: పవర్ఫుల్ ఆలయాలు.. విచిత్రమైన నైవేధ్యాలు
Temples: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ జరిగిన అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల్లోని నైవేధ్యాల విషయంపై ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నాయి. మన దేశంలో కొన్ని ఆలయాలు ఎంత ప్రసిద్ధమో.. అక్కడ పెట్టే నైవేధ్యాలు, ప్రసాదాలు కూడా అంతే ప్రసిద్ధం. ఇప్పుడు నైవేధ్యం అనే విషయం సంచలనంగా మారింది కాబట్టి.. మన దేశంలోని కొన్ని ఆలయాల్లో పెట్టే విచిత్రమైన నైవేధ్యాల గురించి తెలుసుకుందాం.
మంచ్ మురుగన్ – కేరళ
కేరళలో ప్రసిద్ధమైన ఓ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి మంచ్ మురుగన్ అనే పేరు కూడా ఉంది. ఈ పేరు వెనక ఓ విచిత్రమైన కథ ఉంది. ఓ బాలుడు సరదాగా ఈ ఆలయంలోని గంటను మోగిస్తూ ఆడుకుంటుంటే ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యంతో ఇంట్లో నిద్రపోతూ మురుగన్ పేరునే స్మరించడాన్ని అతని తల్లిదండ్రులు గమనించారు. దాంతో ఆ బాలుడిని ఉదయాన్నే మురుగన్ ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయానికి వెళ్లిన సాయంత్రానికే ఆ బాలుడు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు.
అప్పుడు మళ్లీ అదే ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్న పూజారి ఆ బాలుడితో ఇలా అన్నాడట. నీకు మురుగన్ నొప్పిని తగ్గించాడు కదా. మరి మురుగన్‌కి నువ్వేమీ ఇవ్వవా అన్నాడట. అప్పుడు ఆ బాలుడు ఎంతో ఇష్టంగా తినే మంచ్ చాక్లెట్‌ని మురుగన్ ముందు ఉంచాడు. దాంతో మంచ్ చాక్లెట్‌ను కానీ ఇతర చాక్లెట్లను కానీ మురుగన్‌ను నైవేధ్యంగా సమర్పిస్తే ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా తీరుస్తాడు అనే ప్రచారం జరిగిపోయింది.
శ్రీ వడక్కుంనాథన్ ఆలయం – కేరళ
కేరళలోని త్రిశ్శూర్‌లో ఉన్న శ్రీ వడక్కుంనాథన్ శివాలయంలో కూడా వింత నైవేధ్యాలను సమర్పిస్తుంటారు. సాధారణంగా నైవేధ్యం అంటే తినే వస్తువు. కానీ ఈ ఆలయంలో మాత్రం సీడీలు, పుస్తకాలు, డీవీడీలు సమర్పిస్తుంటారు. మనం నేర్చుకునే జ్ఞానం దేవుడు మనకు ఇచ్చిన కానుక కాబట్టి.. ఆయన ఇచ్చిన టెక్నాలజీ, జ్ఞానం ద్వారానే ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటారట. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించేవారికి పుస్తకాలు, సీడీలు, డీవీడీలు వంటివి ఇస్తుంటారు.
అళగర్ ఆలయం – మధురై
Temples: తమిళనాడులోని మధురైలో ఉన్న అళగర్ (విష్ణుమూర్తి) ఆలయంలో రకరకాల దోసెలను స్వామివారికి నైవేధ్యంగా పెడుతుంటారట. ఈ ఆలయానికి వచ్చేవారు నేరుగా దోసెలను తీసుకురాలేకపోయినా దోసెలు వేసేందుకు వాడే పప్పు దినుసులను తీసుకెళ్లి సమర్పించవచ్చు. ఇలా దోసెలు, పప్పు దినుసులు సమర్పించి ఏది కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం.
మురుగన్ ఆలయం – తమిళనాడు
తమిళనాడులోని పళని హిల్స్‌లో ఉన్న మురుగన్ ఆలయంలో పంచామృతం జామ్‌లను ప్రసాదంగా పెడతారు. ఐదు రకాల పండ్లు, బెల్లం పాకం, పీచుమిఠాయి వేసి తయారుచేసిన జామ్ని మురుగన్‌కు నైవేధ్యంగా పెట్టి ఆ తర్వాత దానిని ప్రసాదంగా పంచుతారు.
కాళీ మాతా ఆలయం – కలకత్తా
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తాలో చైనీస్ టౌన్ అనే ప్రాంతం ఉందట. అక్కడ చైనీస్ కాళీ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారికి నైవేధ్యంగా మోమోలు, నూడుల్స్ పెడతారట. ఇక్కడి అమ్మవారిని చైనా కమ్యూనిటీకి చెందినవారే ఎక్కువ పూజిస్తారని చెప్తుంటారు.
కామాఖ్య దేవి ఆలయం – అస్సాం
ఇక్కడి అమ్మవారి ఆలయం చాలా శక్తిమంతమైనది. ఇక్కడ అమ్మవారు యోని రూపంలో దర్శనమిస్తుంది. ఇక్కడ అంబుబాచి అనే వేడుకను ఘనంగా చేస్తారు. ఈ వేడుక తొలి మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. నాలుగో రోజు ఆలయాన్ని తెరిచి రుతుస్రావ రక్తంలో ముంచిన గుడ్డ ముక్కలను సమర్పిస్తారట.
కాలభైరవనాథ్ ఆలయం – ఉజ్జయిని
ఉజ్జయిని కాలభైరవనాథ్ ఆలయంలో వైన్ సీసాలను నైవేధ్యంలా సమర్పిస్తారు. మరాఠా కాలంలో ఈ కాలభైరవ్‌నాథ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం బయట ఏడాదంతా వైన్ బాటిళ్ల ఫోటోలు కనిపిస్తాయి.