Rats: ఎలుక‌ల్ని పట్టే ఉద్యోగం.. జీతం కోటి రూపాయ‌లు!

NewYork: మ‌న దేశంలో ఎలుక‌ల్ని,(rats) బొద్దింక‌ల్ని చంపేందుకు మందులు వాడుతుంటారు. ఎలుక‌ల(rats) బెడ‌ద ఎక్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల్లో అలావాటైపోయిన‌ట్లు ప్ర‌జ‌లు జీవిస్తుంటారు. కావాలంటే రోడ్లు ఊడ్చే వారినో లేదా డ్రైనేజీలు క్లీన్ చేసేవారినో పిలిపించి బాబూ 100 రూపాయ‌లు ఇస్తాం ఎలుక‌ల్ని ప‌ట్టి చంపేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ అమెరికాలోని న్యూయార్క్(newyork) రాష్ట్రంలో ఇలా కాదు. ఎలుక‌ల్ని ప‌ట్టుకోవ‌డానికి ఓ మ‌హిళ‌ను నియ‌మించుకున్నారు. అంతేకాదు.. ఇందుకు ఆ మ‌హిళ‌కు అక్ష‌రాలా కోటి 20 ల‌క్ష‌లు జీతంగా ఇస్తున్నార‌ట‌.

పైగా ఈ ఉద్యోగం ఇచ్చింది న్యూయార్క్ న‌గ‌ర మేయ‌ర్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. న్యూయార్క్‌లోని కొన్ని ప్ర‌దేశాల్లో ఎలుక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉంద‌ట‌. వాటిని ఎలాగైనా నిర్మూలించ‌డానికి మేయ‌ర్ రోడెంట్ మిటిగేష‌న్ ఆఫీస‌ర్ పోస్టులను ప్ర‌క‌టించారు. ఈ పోస్టుల‌కు దాదాపు 900 మంది అప్లై చేసారు. వీరంద‌రిలో కేథ‌లీన్ అనే మ‌హిళ ఎంపిక‌య్యారు. ఇందుకు కార‌ణం ఆమెకు ఎలుక‌లంటే అస‌హ్యం. ఎలుక‌లను ద్వేషించేవారే వాటిని నిర్మూలించ‌గ‌ల‌ర‌ని మేయ‌ర్ ఆమెను ఎంచుకున్నారు.

ఈ విష‌యాన్ని మేయ‌ర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్ర‌క‌టించారు. ఎలుక‌లూ.. ఇక మీ ప‌ని అయిపోయిన‌ట్లే అంటూ న్యూయార్క్ రోడెంట్ మిటిగేష‌న్ ఆఫీసర్ పేరును వెల్లడించారు. గ‌తంలో కేథ‌లీన్ ఎలుక‌లకు ఎక్క‌డా తిండి, నీరు దొర‌క్కుండా ఉండేలా కొన్ని క్యాంపెయిన్ల‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. అందుకే ఆమె సులువుగా ఈ ఉద్యోగం సంపాదించ‌గ‌లిగారు. త‌న వృత్తిలో భాగంగా మిగిలిన ఆహారం, చెత్త వేయ‌డానికి ఎలుక‌లు ద‌రిచేర‌ని క‌వ‌ర్ల‌ను న్యూయార్క్ అంత‌గా పంచుతామ‌ని కేథ‌లీన్ తెలిపారు.

న్యూయార్క్‌లోని ఐదు ప్ర‌ధాన ప్రాంతాల్లో ఎలుక‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఎలుకల్ని ప‌ట్టుకోవ‌డానికి ఓ మ‌హిళ‌ను నియ‌మించి ఆమెకు అన్ని వేల డాలర్లు జీతంగా ఇవ్వ‌డమేంటి అని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.