చిన్నప్పుడు కిడ్నాపై.. పెద్దయ్యాక లాయరై నిందితులను పట్టించాడు
Uttar Pradesh: పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తితో విధి ఓ వింత నాటకం ఆడింది. ఆల్రెడీ ఇతని కథను పోలిన సినిమాలు వచ్చేసాయి. ఇంతకీ ఏంటా కథ? ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన హర్ష్ గర్గ్ అనే ఏడేళ్ల బాలుడిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసారు. ఆ తర్వాత బాలుడిని పోలీసుల కాపాడారు. ఈ విషయాన్ని ఆ బాలుడు ఇంతటితో వదల్లేదు. పెద్దయ్యాక లా చదివి.. న్యాయవాదిగా మారి తన కేసును తనే వాదించుకుని తనను కిడ్నాప్ చేసిన వారికి శిక్ష పడేలా చేసాడు.
2007 ఫిబ్రవరి 10న హర్ష్ తన తండ్రితో కలిసి బయటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు హర్ష్‌ని కిడ్నాప్ చేసారు. అతని తండ్రి కాపాడటానికి యత్నిస్తుండగా అతనిపై కాల్పులు జరిపారు. రూ.55 లక్షలు ఇస్తే హర్ష్‌ని వదిలేస్తామని బెదిరించారు. హర్ష్ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో పకడ్బందీగా ప్లాన్ చేసి 26 రోజుల తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హర్ష్‌ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
మొత్తం 12 మంది నిందితులు కాగా.. అందులో 8 మందిపై మాత్రమే నేరం చేసినట్లు ఆధారాలు ఉండటంతో వారికి చెరో లక్ష జరిమానా విధిస్తూ యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది. మిగతా నలుగురిని ఆధారాలు లేవని వదిలేసింది. అయితే.. హర్ష్ తన పట్ల జరిగిన దారుణాన్ని మర్చిపోలేకపోయాడు. తన జీవితంలో ఒకే లక్ష్యం పెట్టుకున్నాడు. తనను ఎత్తుకెళ్లి తన తండ్రిని గాయపరిచిన అందరికీ శిక్ష పడాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. అలా లా చదివి 24 ఏళ్లకు లాయర్ అయ్యాడు. ఆ తర్వాత తన కేసును తనే రీఓపెన్ చేయించుకుని మిగతా నలుగురిపై కూడా తగిన ఆధారాలు సేకరించి వారికి కూడా శిక్ష పడేలా చేసాడు. సెప్టెంబర్ 17న కోర్టు ఆ నలుగురికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. దాంతో హర్ష్ ఇప్పుడు ఆగ్రాలో తెగ ఫేమస్ అయిపోయాడు.