Renu Desai: నేను ఎమ్మెల్యేని కాను.. సాయం చేయలేను
Renu Desai: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు ఓ వ్యక్తి సాయం చేయండి మేడం అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిక్వెస్ట్ చేసారు. భీమవరం ప్రాంతానికి చెందిన ఓ నెటిజన్ రేణూని సాయం చేయాలని కోరారు. 70 ఏళ్లుగా ఉంటున్న వారిని ఉన్నట్టుండి ప్రభుత్వ భూములు లాక్కుని ఇళ్లు నిర్మించుకున్నారని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని తెలిపారు. లోన్లు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నామని.. వాటర్ బిల్స్, కరెంట్ బిల్స్ కట్టుకుంటున్నామని అన్నారు.
దాదాపు 20 నుంచి 30 కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే ఆయన వేరే స్థలాలు కేటాయిస్తాం అక్కడ ఇళ్లు కట్టుకోండి అంటున్నారట. ఈలోగా నాలుగు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయకపోతే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని తమ గోడుకు రేణూకు చెప్పుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నోటికొచ్చినట్లు తిట్టి పంపించారని.. ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే కుటుంబంతో సహా రోడ్డున పడతాం దయచేసి సాయం చేయండి మేడం అని వేడుకున్నారు. ఈ మెసేజ్‌లు చూసిన రేణూ ఏ పార్టీ ఎమ్మెల్యే అని అడగ్గా.. తెలుగు దేశం పార్టీ అని చెప్పారు.
ఇదే విషయాన్ని మీడియా వారిని పిలిపించి చెప్తే సమస్య తీరే అవకాశం ఉందని.. తనకు చెప్తే వెంటనే తీర్చడానికి తాను ఎలాంటి ప్రభుత్వ హోదాలో కానీ ఎమ్మెల్యే స్థానంలో కానీ లేనని చెప్పారు. ఈ మెసేజ్ స్క్రీన్‌షార్ట్స్‌ని రేణూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ఇలాంటి మెసేజ్‌లు చూసినప్పుడు సాయం చేయాలనిపించినా ఏమీ చేయలేని పరిస్థితి అని.. ఎవరైనా ఏమైనా చేయగలిగితే తమ వంతు సాయం చేస్తే బాగుంటుందని తన ఫాలోవర్లను కోరారు.