Elon Musk Starlink: అంత‌రిక్షంలో అడ్డుప‌డుతున్న మ‌స్క్ సాటిలైట్లు

Elon Musk Starlink:  టెక్ బిలియ‌నేర్ ఎలాన్ మ‌స్క్‌కి చెందిన స్టార్‌లింక్ సాటిలైట్లు అంత‌రిక్షంలో ప‌రిశోధ‌న‌ల‌కు భంగం క‌లిగిస్తున్నాయ‌ట‌. శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన రేడియో సంకేతాలను క‌ప్పేసి అంతరిక్ష పరిశీలనలకు భంగం కలిగిస్తున్నాయని శాస్త్రవేత్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఎక్కువ సంఖ్యలో ప్ర‌వేశ‌పెడుతున్న‌ కొద్దీ అవి ఆకాశంలోని ఖగోళ వస్తువులను క‌ప్పేస్తున్నాయి. దీని వల్ల బ్లాక్ హోల్స్, ఎక్సోప్లానెట్లు, గెలాక్సీలను అధ్యయనం చేయడం మరింత కష్టమవుతోందని శాస్త్రవేత్త‌లు అంటున్నారు.

అంత‌రిక్షాన్ని పరిశీలించడానికి ముఖ్యమైన సాధనం యూరోపియ‌న్‌లో-ఫ్రీక్వెన్సీ అరే (LOFAR) అనే టెలిస్కోప్. స్టార్‌లింక్ కలిగించే ఆటంకాల‌ వల్ల తక్కువ రేడియేష‌న్ క‌లిగిన‌ ఖగోళ వస్తువులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఉపగ్రహాలు అనుకోకుండా ఎలెక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్‌ను విడుద‌ల చేస్తున్నాయి. ఇది రేడియో టెలిస్కోప్స్‌ను ప్రభావితం చేస్తోంది. ఈ రేడియేషన్ శాస్త్రవేత్తలు దూరంగా ఉన్న ఖగోళ వస్తువులను పరిశీలించడం కష్టతరం చేస్తోంది.

స్టార్‌లింక్ ఉపగ్రహాల కొత్త జ‌న‌రేష‌న్ మరింత ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేస్తున్నాయి. దాంతో అవి మ‌రింత ఆటంకాన్ని క‌లిగిస్తున్నాయి. ఇప్పటికే 6,000కు పైగా స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి. స్పేస్ఎక్స్ ప్ర‌తి వారం మరిన్ని ఉపగ్రహాలను ప్రవేశపెడుతోంది. ఉపగ్రహాల సంఖ్య ఈ రీతిగా పెరుగుతూ ఉంటే.. భూమి నుండి ఖగోళ పరిశీలనలు చేయడం దాదాపు అసాధ్యమవుతుంది.