YS Jagan: సముద్ర మార్గాన జగన్ బినామీ పరార్?
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ మైనింగ్ డైరెక్టర్ గనుల వెంకట్ రెడ్డి సముద్ర మార్గాన ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే వెంకట్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బినామీ అనే టాక్ ఉంది. ఎయిర్పోర్ట్ మార్గాన వెళ్తే అందరి దృష్టి ఉంటుందని భావించిన వెంకట్ రెడ్డి సముద్ర మార్గాన బోటులో పారిపోయినట్లు సమాచారం. వెంకట్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. మైన్స్ అండ్ జువాలజీ డైరెక్టర్‌గా పనిచేసి సుమారు 3 వేల కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకు గండికొట్టారట. తాడేపల్లి ముఖ్యనేతలకు భారీగా దోచిపెట్టారట. ఆయన హయాంలో మైనింగ్‌లో ఘోరమైన ఉల్లంఘనలకు పాల్పడి 2856 కోట్ల ప్రభుత్వ సంపదను ప్రైవేట్ వ్యక్తుల పరం చేసారట.
మే 2021 నుంచి జూన్ 2024 వరకు ప్రైవేట్ ఏజెన్సీలు భారీగా ఇసుక తవ్వకాల్లో అగ్రిమెంట్లను ఉల్లంఘించాయి. అయినా వాటిపై వెంకట్ రెడ్డి చర్యలు తీసుకోలేదు. పైగా దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాలను కూడా ఉల్లంఘించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆయన అప్పటి ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకరించారు. తన నిర్వాకాలు బయటపడతాయి అని భయపడి కొత్త ప్రభుత్వం కొలువు తీరక ముందే దేశం నుంచి వెంకట్ రెడ్డి సముద్ర మార్గాన ఉడాయించారట. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరిన వెంటనే ఇసుక తవ్వకాలు, మైనింగ్ అక్రమాలపై ప్రాథమిక నివేదిక తెప్పించింది. వెంకట్ రెడ్డి చేసిన దోపిడీ పర్వం గురించి పలు ఆధారాలు లభించడంతో ఆయన్ను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి ఏసీబీ విచారణకు ఆగస్ట్ 1న ఆదేశించారు.
రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గనుల శాఖలో అక్రమాల పుట్టను పసిగట్టినట్లు సమాచారం. వెంకట్ రెడ్డి ఎక్కడికి వెళ్లారు అనే అంశంపై అధికారులు ఆయన బంధువులను అడిగి తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. అవసరమైతే ఆయన్ను వెతికి పట్టుకునేందుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడానికి కూడా వెనుకాడమని అధికారులు చెప్తున్నారు.