Suchitra: నన్ను ఒంటరిగా రమ్మన్నాడు
Suchitra: ప్రముఖ తమిళ గేయ రచయిత వైరాముత్తు తనతో కూడా అసభ్యకరంగా ప్రవర్తించాలనుకున్నాడని తెలిపారు గాయని సుచిత్ర. గతంలో ఇదే వైరాముత్తు గురించి సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేస్తే ఆమెను తమిళ చిత్ర పరిశ్రమ నుంచి సస్పెండ్ చేసారు. దాంతో కొన్నేళ్ల పాటు చిన్మయికి ఎలాంటి వర్క్ లభించలేదు. షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ఆరోపణలను ఎవ్వరూ పట్టించుకోకపోగా.. తమిళ లెజండరీ నటులైన కమల్ హాసన్, రజనీకాంత్‌లు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా తమిళ చిత్ర పరిశ్రమలో అసలు ఎలాంటి లైంగిక వేధింపులు లేవని ఇటీవల కమల్ హాసన్ వెల్లడించడంపై చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పుడు సుచిత్ర ఆరోపణలు ఎందుకు చేసారంటే.. కేరళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ రిపోర్టు సంచలనంగా మారిన నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు అన్ని పరిశ్రమల్లోనూ ఇలాంటి కమిటీ వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇన్ని నీతులు చెప్తున్న వైరాముత్తు గతంలో తనతో వైరాముత్తు ఎలా ప్రవర్తించాడో సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Suchitra: “” నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మే మాసమ్ అనే పాటను. ఆ పాట ఎంత చెండాలంగా పాడానో నాకు తెలుసు. కానీ వైరాముత్తు నాకు ఫోన్ చేసి అబ్బా మేడమ్ పాటను ఎంత బాగా పాడారంటే నేను ప్రేమలో పడిపోయాను అని చెప్పాడు. ఇలా వైరాముత్తు ఎంత మందికి చెప్పి ఉంటాడో. ఆ పాట బాగా పాడానన్న వంకతో గిఫ్ట్ ఇస్తానని చెప్పి నన్ను ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు. నాకు ఎందుకో అనుమానం వచ్చి మా అమ్మమ్మను తీసుకుని వైరాముత్తు ఇంటికి వెళ్లాను. నా పక్కన అమ్మమ్మ ఉండటం చూసి అతను షాకయ్యాడు. పైగా ఒక్కదానివే రమ్మని చెప్పాను కదా అన్నాడు. నాకు ఎక్కడికెళ్లినా అమ్మమ్మను తీసుకుని వెళ్లడం అలవాటు అని చెప్పాను.
ఆ తర్వాత మా అమ్మమ్మ వైరాముత్తుని తిట్టింది. ఇలా అసహ్యంగా ఆడపిల్లను ఎలా రమ్మంటారు అని తిట్టింది. దానికి వైరాముత్తు నేను సుచిత్రను నా కూతురిలా భావించే రమ్మన్నానమ్మా. తప్పుగా అనుకోకండి అన్నాడు. ఆ తర్వాత ఏదో గిఫ్ట్ ఇస్తానన్నారు కదా సర్ అని అడిగితే.. కంగారుపడుతూ లోపలి నుంచి రెండు షాంపూ బాటిళ్లు ఇచ్చాడు. అప్పుడే అర్థమైపోయింది. ఇవ్వడానికి గిఫ్ట్ లేదూ ఏమీ లేదు.. నన్ను లైంగికంగా వేధించడానికే పిలిచాడని అంటూ షాకింగ్ విషయాలు “” వెల్లడించారు సుచిత్ర.
ఇప్పటికే వైరాముత్తుపై దాదాపు 20 మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేసారు. దేశంలో అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో కళ్ల ముందే సాక్షాలు నిందితులు ఉన్నా కూడా న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వస్తోందని.. ఇలాంటి నేపథ్యంలో వైరాముత్తు లాంటి వాడిని విచారించి శిక్షిస్తారు అనుకోవడం తన భ్రమ అని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసారు. వైరాముత్తు కేసులో చిన్మయి 2018 నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు వైరాముత్తుపై ఒక్క ఫిర్యాదును కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు.
మరోపక్క మహిళా రెజ్లర్లు తమపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుంటే వారికి న్యాయం జరగాలని కమల్ హాసన్ ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదే విషయాన్ని చిన్మయి ప్రస్తావిస్తూ.. సొంత చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ఆడపిల్లలు వైరాముత్తు విషయంలో ఫిర్యాదులు చేస్తుంటే కమల్ గారికి కనిపించలేదు కానీ ఎక్కడో ఢిల్లీలో చేస్తున్న ధర్నాపై న్యాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది అంటూ ట్వీట్ చేసారు.