YSRCP: అన్న రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జ్ఞానం బోధపడింది. 2029లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే ఆయన గ్రౌండ్ లెవెల్‌లో సమీక్షలు మొదలుపెట్టారు. వారంలో రెండు సార్లు ప్రతి నియోజకవర్గంలో రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటుచేస్తున్నారు. అందుబాటులో లేని నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, నేతలపై మండిపడుతున్నారు.
అయితే.. పార్టీ ఎలాగో ఓడిపోయింది కాబట్టి కొందరు నేతలు కనీసం ఒక రెండేళ్లయినా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నారు. కానీ జగన్ అందుకు ఒప్పుకోవడంలేదు. ఇప్పటి నుంచే గెలిచిన, ఓడిన ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవల్‌లోనే ఉంటూ పార్టీకి మళ్లీ బలం తీసుకురావాలని హెచ్చరించారు. కానీ జగన్ మాత్రం వారం మొత్తం బెంగళూరులో ఉంటూ.. అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తున్నారు. ప్రతిసారి బెంగళూరు నుంచి గన్నవరంకు ప్రయాణిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు బెంగళూరుకి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ తమని మాత్రం ఎక్కడికీ వెళ్లనివ్వకుండా గ్రౌండ్ లెవల్ నుంచి పనిచేయాలని అనడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమతో పాటు జగన్ కూడా తాడేపల్లిలో ఉంటూ పర్యవేక్షిస్తుంటే తమకు కూడా కాస్త ధైర్యం ఉంటుందని అలా కాకుండా అప్పుడప్పుడు వచ్చి పలకరించడం బాలేదని అంటున్నారు. నిన్నటి వరకు పిఠాపురంకి వెళ్లి కాస్త హడావుడి చేసిన జగన్ మళ్లీ బెంగళూరు విమానం ఎక్కేసారు. మళ్లీ ఏదన్నా జరిగినా.. తమ నేతలు ఎవరైనా అరెస్ట్ అయినా అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతారని టాక్. ఇక తన పాస్‌పోర్ట్ కోసం ఎదురుచూస్తున్న జగన్.. అది వచ్చిన వెంటనే కొన్ని నెలల పాటు లండన్ టూర్ చేస్తారని తెలుస్తోంది.