Early Periods: ఇంట్లోని ర‌సాయ‌నాల వ‌ల్ల త్వ‌ర‌గా రుతుక్ర‌మం

these chemicals are causing Early Periods among girls

Early Periods: సాధార‌ణంగా ఆడ‌పిల్ల‌ల‌కు 11, 12 ఏళ్ల వ‌య‌సులో రుతుక్ర‌మం రావాలి. దానినే పెద్ద మ‌నిషి అవ్వ‌డం.. లంగావోణీ ఫంక్ష‌న్ అని చేస్తుంటారు. ఇంట్లో ఆడ‌పిల్ల పెద్ద మ‌నిషి అయ్యిందంటే ఆ ఇల్లు ఎంతో క‌ళ‌క‌ళలాడిపోతుంటుంది. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు అలా లేవు. ఎంద‌కంటే ఒక వ‌య‌సులో రావాల్సిన రుతుక్ర‌మం మ‌రీ ముందుగానే వ‌చ్చేస్తోంది. దాంతో పెద్ద‌య్యాక వారికి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డం, బ్రెస్ట్ క్యాన్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు వస్తున్నాయి. మ‌రో షాకింగ్ విష‌యం ఏంటంటే.. మ‌న ఇంట్లోని కొన్ని వ‌స్తువుల నుంచి వ‌చ్చే ర‌సాయ‌నాల వ‌ల్లే త్వ‌ర‌గా రుతుక్ర‌మం వ‌చ్చేస్తోంద‌ట‌.

మ‌నం రోజూ వాడే పెర్ఫ్యూంలు, సోపులు, డిట‌ర్జెంట్ల‌లోని కొన్ని ర‌సాయ‌నాల వ‌ల్ల ఇలా జ‌రుగుతోందని అమెరికాకి చెందిన నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఈ సోపులు, పెర్ఫ్యూంలు, డిట‌ర్జెంట్ల నుంచి ఒక ర‌సాయ‌నం వ‌ల్ల మంచి సువాస‌న‌లు వ‌స్తుంటాయి. ఆ ర‌సాయ‌నం పేరు మ‌స్క్ ఆంబ్రెట్టే. ఈ ర‌సాయ‌నాన్ని ఎండోక్రైన్ డిస్‌ర‌ప్ట‌ర్ అంటార‌ట‌. అంటే ఈ ర‌సాయ‌నం ఒంట్లోని హార్మోన్ల‌ను అత‌లాకుత‌లం చేసేస్తుంది. ఫ‌లితంగా స‌మ‌యానికి జ‌ర‌గాల్సినవి జ‌ర‌గ‌నివ్వ‌కుండా చేస్తుంది. వాటిలో ఈ రుతుక్ర‌మం ఒక‌టి. ఈ ర‌సాయనం వ‌ల్ల ఆడ‌పిల్ల‌ల్లో ఒక వ‌య‌సులో రావాల్సిన రుతుక్ర‌మం మ‌రీ ముందుగా వ‌చ్చేస్తోంద‌ట‌.

ఈ మ‌స్క్ ఆంబ్రెట్టే అనే కెమిక‌ల్‌ను చాలా వ‌స్తువుల్లో వాడుతున్నారు. దీని వ‌ల్ల పిల్ల‌ల్లో మెద‌డు ఎద‌గ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుందని ప‌రిశోధ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాబ‌ట్టి త‌ల్లిదండ్రులే త‌మ పిల్ల‌ల విష‌యంలో ఎలాంటి వ‌స్తువులు, ఉత్ప‌త్తులు వాడుతున్నారో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఈ మ‌స్క్ ఆంబ్రెట్టే అనే ర‌సాయ‌నం కెన‌డా, యూర‌ప్ దేశాల్లో నిషేధించారు. కానీ చాలా దేశాల్లో దీనిని ఎన్నో ఉత్ప‌త్తుల్లో వాడుతున్నారు.