Paruchuri: నటించొద్దని అమ్మ ఒట్టేయించుకుంది
Hyderabad: సినీ రచయితగా, నటుడిగా పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishna)కి చాలా మంచి గుర్తింపు ఉంది. ఒళ్లు గగుర్పొడిపించే డైలాగ్స్ రాయడంలోను, చెప్పడంలోను ఆయనది ప్రత్యేకమైన స్టైల్. రచయితగానే కాకుండా నటుడిగానూ ఆయన కొన్ని సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా గోపాలకృష్ణ సినిమాల్లో కనిపించడం లేదు. తన అనుభవంతో పలు సినిమాల జయాపజయాలకు సంబంధించిన కారణాలను విశ్లేషిస్తూ యూట్యూబ్(YouTube)లో వీడియోలు పెడుతున్నారు. అయితే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో కనిపించకపోవడానికి కారణాలు కూడా వెల్లడించారు.
‘నిజానికి నేను సినిమాల్లో కనిపించకపోవడానికి కారణం మా అమ్మ. నేను నటించవద్దని మా అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. ‘‘ఇద్దరు అన్నదమ్ములు కలిసి రాస్తూ వచ్చారు. నువ్వు వేషాలు వేయడానికి వెళితే పెద్దాడు ఒక్కడే రాసుకోలేక చాలా కష్టపడుతున్నాడు. వాడి కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను” అన్నారు. 1985, 86, 87 సంవత్సరాలలో నటుడిగా నేను చాలా బిజీగా ఉన్నాను. ఆ సమయంలో ఆమె ఆ మాట అన్నారు. నిజంగానే నేను నటన వైపు వెళ్లడం వలన అన్నయ్యకి ఇబ్బంది అయింది. రాత్రివేళలో కూడా అలా రాస్తూ కూర్చునేవాడు. అది మా అమ్మగారికి బాధను కలిగించింది. అందుకే అలా ఒట్టు వేయించుకుంది. అమ్మ మాట .. అమ్మ ఒట్టు .. అందుకే అప్పటి నుంచి నటించడం మానేశాను” అన్నారు. ‘ప్రస్తుతం అన్నయ్య రెస్టు తీసుకుంటున్నాడు. నేను మాత్రమే రాసి పరుచూరి బ్రదర్స్(Paruchuri Brothers)కి బదులు నా పేరుతో సింగిల్ కార్డు వేయించుకోవడం నాకు ఇష్టంలేదు’ అంటూ రాయడం కూడా ఆపేసినట్టు తెలిపారు గోపాలకృష్ణ.