Kargil War: కార్గిల్ యుద్ధంలో మా ప్రమేయం ఉంది.. తొలిసారి ఒప్పుకున్న పాక్
kargil war: 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం ఉందని తొలిసారి పాకిస్థాన్ బహిరంగంగా ప్రకటించింది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునిర్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఎన్నో యుద్ధాల్లో పాకిస్థానీ సైనికులు ప్రాణాలు కోల్పోయారని.. వాటిలో కార్గిల్ యుద్ధం కూడా ఉందని అన్నారు. లద్ధాక్ ప్రాంతంలోని కార్గిల్ ప్రాంతాన్ని పాకిస్థానీ తీవ్రవాదులు, సైనికులు ఆక్రమించుకోవడంతో అది కార్గిల్ యుద్ధానికి దారి తీసింది.
దాదాపు మూడు నెలల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఎందరో భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. తీవ్రవాదులను ఏరిపారేసి మళ్లీ కార్గిల్‌ను టైగర్ హిల్ ప్రాంతాన్ని భారత్ దక్కించుకోగలిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్ క్లింటన్.. పాక్ సైనికులను కార్గిల్ నుంచి వెనక్కి రప్పించాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను రిక్వెస్ట్ కూడా చేసారు. కశ్మీర్‌ను కబ్జా చేసేందుకు పాకిస్థానీ తీవ్రవాదులు వేసిన ఎత్తుగడే కార్గిల్ యుద్ధానికి దారి తీసిందని ఇప్పటికీ భారత్ ఆరోపిస్తోంది.
అయితే ఈ కార్గిల్ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ బుకాయిస్తూ వచ్చింది. అప్పుడు భారత్ సాక్ష్యాలుగా పాకిస్థానీ సైనికుల ఫోటోలను కూడా విడుదల చేసింది. తమ ప్రమేయం లేదని పాక్ నిరూపించుకోవడానికి యుద్ధంలో మృతిచెందిన పాక్ సైనికుల మృతదేహాలను కూడా కలెక్ట్ చేసుకోలేదు. కార్గిల్ యుద్ధంలో దాదాపు 545 మంది భారతీయ సైనికులు అమరవీరులయ్యారు.