Telangana Politics: పొంగులేటి, జూపల్లి దారెటు?

Hyderabad: తెలంగాణ(telangana)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నిక(Assemble elections)లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక నాయకులు పార్టీలు మారుతున్నారు. క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తూ… అదే విధంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పలువురు పార్టీలు మారేందుకు సిద్దమయ్యారు. ఇందులో ముందువరుసలో ఉన్నది.. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(ponguleti srinivas reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(jupalli krishna rao)లు ఉన్నారు. వారు ఇప్పటికే తాము జాతీయ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌(congress), బీజేపీ(bjp)ల్లో ఏ పార్టీలో చేరుతారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా(khammam)లో కీలక నాయకుడైన మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డితో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ రాజేందర్(etela rajendhar) కూడా ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్ (kollapur) నుంచి బరిలో నిలిచే.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన బలమైన నేత కావడంతో రెండు పార్టీలు ఆయన చేరికపై దృష్టి సారించాయి. బీజేపీ నాయకులు డి.కె.అరుణ, జితేందర్ రెడ్డిలు కూడా జూపల్లితో ఫోన్లో మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో పొంగులేటి, జూపల్లి ఇద్దరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇటీవల హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటకు వచ్చిన సమయంలో ఇక్కడి నాయకులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. బీజేపీలోకి ఇతర పార్టీలకు చెందిన నాయకులను ఆహ్వానించాలని దీని వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆయన సూచించారు. దీంతో బీజేపీ పెద్దలు ప్రధానంగా.. చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటెల అదే పనిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై అసంతృప్తితో ఉన్న వారికి వలవేసి పట్టుకునే పనిలో ఉన్నారు. ఇదే విషయంపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay), మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు.