KL Rahul: నేను బాధలో ఉన్నప్పుడు అనుష్క శర్మ ధైర్యాన్నిచ్చింది
KL Rahul: తాను బాధలో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఎంతో ధైర్యాన్నిచ్చిందని అన్నారు కేఎల్ రాహుల్. త్వరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో 2014 నుంచి 2015 మధ్యలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తాను ఎంత ఘోరంగా విఫలమయ్యాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. అదే సమయంలో తాను ఇంటర్నేషనల్ డెబ్యూ చేసానని.. కానీ ఘోరంగా ఓటమి పాలయ్యానని అన్నాడు. ఓడిపోయిన బాధలో ఉంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తనను డిన్నర్‌కి తీసుకెళ్లారని.. వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఓటముల గురించి చెప్పి తనలో ధైర్యం నింపారని తెలిపాడు.
అలా చాలా సార్లు విరాట్, అనుష్క డిన్నర్‌కి వెళ్తుంటే పానకంలో పుడకలాగా తాను కూడా వారితో కలిసి వెళ్తుండేవాడనంటూ నవ్వుకున్నాడు. వారిద్దరూ ఇచ్చిన ధైర్యం వల్లే నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనే 110 బాదానని తెలిపాడు. అదే తన క్రికెట్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని ఆ తర్వాత అలాంటివి 50 టెస్ట్‌లు ఆడానని వెల్లడించాడు. ఈ రోజు బెంగళూరులో మొదలైన దులీప్ ట్రోఫీలో రాహుల్ ఆడుతున్నాడు.