డేటింగ్ చేసుకోవడానికి సెలవులు ఇచ్చే కంపెనీ..!
Tinder: ఒంట్లో బాలేకపోతే సెలవులు ఇచ్చే కంపెనీలను చూసాం. లేదా ఇతర అవసరాలకు సెలవులు ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఒకపూట సెలవు ఇవ్వడానికి ఏడుస్తుంటాయి. కానీ ఈ కంపెనీ మాత్రం హాయిగా టిండర్ అనే డేటింగ్ యాప్ ద్వారా హాయిగా డేటింగ్ చేసుకునేందుకు సెలవులు ఇస్తోంది. ఇంతకీ ఈ కంపెనీ ఎక్కడ ఉందో తెలుసా? థాయ్‌లాండ్‌లో. అసలేంటీ కంపెనీ విశేషాలు? ఎందుకు డేటింగ్ సెలవులు ఇస్తోంది?
థాయ్‌లాండ్‌లో వైట్‌లైన్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఇంకా సమర్ధవంతంగా పనిచేయాలన్న ఉద్దేశంతో వారికి డేటింగ్ సెలవులు ఇస్తోంది. అది కూడా టిండర్ అనే డేటింగ్ యాప్‌లో ఆరు నెలల సభ్యత్వ రుసుం కూడా చెల్లిస్తుంది. ప్రేమలో పడితే ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఆ కంపెనీ నమ్మకం. ఇంతకీ కంపెనీకి ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా? ఓసారి ఉద్యోగులంతా హెచ్ఆర్తో కలిసి మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో వర్క్‌కి సంబంధించిన విషయాలే కాకుండా అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో హెచ్ఆర్ ఒక ఉద్యోగినిని మీకు బాయ్‌ఫ్రెండ్ లేడా అని అడిగాడట. అప్పుడు ఆ అమ్మాయి.. ఈ వర్క్ బిజీలో నాకు ప్రేమించడానికి డేటింగ్ చేయడానికి కూడా సమయం లేదు సర్ అని చెప్పిందట. దాంతో వెంటనే ఈ విషయాన్ని హెచ్ఆర్ మేనేజ్మెంట్కు చెప్పి టిండర్‌తో పార్ట్నర్షిప్ అయ్యారు. అయితే ఈ డేటింగ్ సెలవులు అందరికీ ఇవ్వరు. కేవలం ఉద్యోగంలో చేరాక ప్రొబేషన్ పీరియడ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసాకే ఈ అవకాశం ఇస్తారు. ఈ టిండర్ సెలవులు వాడుకోవాలంటే వారం రోజుల ముందే హెచ్ఆర్కి ఇంటిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.