Sunita Williams: సునీత ఉన్న స్పేస్‌క్రాఫ్ట్ నుంచి వింత శబ్దాలు.. నాసా బోయింగ్ మధ్య వాగ్వాదం
Sunita Williams: అంతరిక్షంలోని స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చిక్కుకుని ఉన్న ప్రముఖ భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ రాకపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. బోయింగ్ సంస్థకు చెందిన ఈ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునితా విలియమ్స్‌తో పాటు బచ్ విల్మోర్ అనే మరో వ్యోమగామి కూడా ఉన్నాడు. అతనికి స్పేస్‌క్రాఫ్ట్‌లో ఏవో వింత శబ్దాలు వినిపించాయని వెల్లడించాడు. దాంతో నాసా కాస్త ఆందోళన చెందింది. ఈ నెల 6న స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఒక్కటే భూమి మీదకు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వింత శబ్దాలు రావడం అనేది కాస్త ఆందోళన కలిగించే అంశం.
స్పేస్‌క్రాఫ్ట్‌లో సునితా విలియమ్స్, విల్మోర్ టెక్నికల్ సమస్యల వల్ల మూడు నెలలుగా ఇరుక్కుని ఉన్నారు. దాంతో వీరిద్దరికీ 2025 ఫిబ్రవరిలో భూమి మీదకు తీసుకురావాలని నాసా నిర్ణయించింది. ఇందుకోసం ఎలాన్ మస్క్ టీం తయారుచేసిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్‌స్యూల్‌ను పంపనున్నారు. మరోపక్క సునితా విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఇరుక్కుపోవడంపై నాసా.. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారుచేసిన బోయింగ్ సంస్థ వాగ్వాదానికి దిగాయి. నీది తప్పంటే నీది తప్పు అంటూ గొడవపడ్డాయి.
కేవలం 8 రోజుల పాటు సునితా విలియమ్స్, విల్మోర్ అంతరిక్షంలో ఉండాల్సి ఉండగా.. బోయింగ్ సంస్థ స్పేస్‌క్రాఫ్ట్‌ను తయారు చేయడంలో విఫలం కావడంతో థ్రస్టర్లు ఊడిపోయి హీలియం గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో 8 రోజుల్లో వారు భూమి మీదకు రావాల్సి ఉండగా.. అది కాస్తా 8 నెలలు దాటిపోయేలా చేసింది.