Kukkala Vidyasagar: జత్వానీ మోసగత్తె.. నన్ను హనీట్రాప్ చేసింది
Kukkala Vidyasagar: కొంతకాలంగా ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీ విషయంలో నిప్పు రాజుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కాదంబరిని మోసం చేసి ఆమెను విజయవాడ పోలీసుల చేత కిడ్నాప్ చేయించి మరీ టార్చర్ పెట్టాడంటూ జత్వానీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు తనను చాలా దారుణంగా చిత్ర హింసలకు గురిచేసారని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు.
ఈ జత్వానీ విషయంలో నిందితుడిగా ఉన్న విద్యాసాగర్ మీడియా ముందుకు వచ్చి తొలిసారి తన వాదనలను వినిపించారు. కాదంబరి జత్వానీ వల్ల తానే మోసపోయానని.. తనను హనీట్రాప్ చేసిందని అన్నారు. “” నాకు కాదంబరి జత్వానీ తెలుసు. ఓసారి నాకు ఎయిర్‌పోర్ట్‌లో పరిచయం అయ్యింది. తనని తాను పరిచయం చేసుకుంటూ నటాషా అని చెప్పింది. ఆమె పాస్‌పోర్ట్ చూస్తే కాదంబరి అని ఉంది. అదేంటి కాదంబరి అని ఉంది అని అడిగితే.. కాదంబరి పేరు పాతదిగా ఉందని తనకు నచ్చలేదని నటాషా అని పెట్టుకున్నట్లు చెప్పింది. ఆమె ప్రభుత్వ ఐడీ కార్డులు కూడా తప్పుగా ఉన్నాయి. ఆమె అమాయకురాలు అయినప్పుడు తప్పుడు ఐడీ కార్డులు ఎందుకు చూపించాలి? ఆ అవసరం ఏముంది?
కాస్త అందంగా, చదువుకున్నవారిగా ఉన్నత స్థాయిలో కనిపించేవారికి ఆకర్షితులం అవుతుంటాం. ఇలాంటి వారి వల్లే నా లాంటి వారు హనీట్రాప్‌లో పడతారు. ఇక్కడ మరో విషయం క్లారిటీగా చెప్పాలని అనుకుంటున్నాను. మా నాన్నగారు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆయన చనిపోయాక నేను దాదాపు ఐదు నెలల వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉన్నాను. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ నుంచి బయటికి వచ్చేసాను. నాకు రాజకీయంగా స్నేహితులు ఉన్నారు కానీ నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. నాకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు సంబంధం లేదు. దయచేసి కాదంబరి అనే యువతిని అమాయకురాలు అనకండి. ఆమె కిడ్నాప్ చేసాను అంటోంది. నాకు కోర్టులపై న్యాయవ్యవస్థపై కాస్త నమ్మకం ఉంది. అక్కడే నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను “” అని తెలిపారు.