12 ఏళ్లుగా రోజుకు అరగంట నిద్రే.. ఎందుకిలా?
Daisuke Hori: ఎప్పటికి వయసులోనే ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. వయసు మీదపడకుండా చేయడం అనేది అసాధ్యం. ఎవరైనా ముసలివారు అవ్వాల్సిందే. కానీ త్వరగా ముసలితనం రాకుండా మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈ టెక్నిక్‌ను ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. కానీ ముసలితనం రాకుండా ఉండేందుకు.. ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉండేందుకు పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా.. రోజుకు అరగంట మాత్రమే నిద్రపోతున్నాడు. ఇలా వారం రోజులో నెల రోజులో కాదు. ఏకంగా పన్నెండేళ్ల నుంచి అతను రోజుకు కేవలం అరగంట మాత్రమే పడుకుంటున్నాడట. మరోపక్క వైద్యులేమో రోజుకు 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలని లేదంటే లేనిపోని రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇతనేమో నాకు అరగంట నిద్రపోయాక అసలు నిద్రకూడా పట్టదు అంటున్నాడు. ఇంతకీ ఇతని కథేంటో తెలుసుకుందాం.
ఇతనిపేరు డైసుకీ హోరీ. జపాన్‌కు చెందిన వ్యక్తి. హోరీ రోజులో కేవలం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నిద్రపోతాడు. ఇక మిగతా సమయంలో జిమ్, వ్యాయామాలు చేస్తూనే ఉంటాడు. వారంలో దాదాపు 16 గంటల పాటు వ్యాయామం చేస్తూనే ఉంటాడు. రోజకు కేవలం అరగంట మాత్రమే నిద్రపోతే నిద్ర, అనారోగ్య సమస్యలు రావా? అని హోరీని అడిగితే.. తన మైండ్‌ను అలా ట్రైన్ చేసుకున్నానని.. ఓ మనిషికి ఎన్ని గంటలు నిద్రపోయాము అనేదాని కంటే ఎంత బాగా నిద్రపోయాము అనేదే ముఖ్యం అని అంటున్నాడు. వైద్యులు, సైనికులు కూడా చాలా తక్కువ సేపు నిద్రపోతుంటారని.. కానీ నిద్రపోయినంత సేపు మంచి నాణ్యమైన నిద్రలోకి జారుకుంటారని అంటున్నాడు. భోజనం చేయడానికి గంట ముందు కాఫీ తాగితే అసలు నిద్రపట్టదని సలహాలు ఇస్తున్నాడు.