USA President: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
USA President: ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలు ఏ దేశంలోనైనా జరుగుతాయంటే అది మన భారతదేశంలోనే. కేవలం మన దేశంలో మాత్రమే వేలాది కోట్లు ఖర్చవుతాయి. మన దగ్గర నామినేషన్ వేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు. కానీ ప్రచార కార్యక్రమాలకు, బహుమతుల పంపిణీలు, ఓటుకు నోటు ఇలా చాలా రకాల దందాలు జరుగుతాయి. వీటన్నింటికీ డబ్బులు కావాలి. మరి అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?
అమెరికాలో ఓటుకు నోటు బహుమతులతో ప్రజల ఓట్లు కొనలేం. కేవలం ఓ వ్యక్తి అమెరికా అధ్యక్ష అభ్యర్ధిగా నిలబడాలంటేనే కోట్ల డాలర్లతో కూడుకున్న పని. పైగా ప్రతి ఎన్నికలకు ఈ ఖర్చు పెరుగుతూనే ఉంటుంది. 2016 ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అయిన ఖర్చు 2.4 బిలియన్ డాలర్లు. అది కాస్తా 2020 నాటికి 14 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ నవంబర్‌లో జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
అధ్యక్ష ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలకు మూడు విధాలుగా ఫండ్స్ వస్తాయి. ఒకటి ప్రజల నుంచి. ప్రతి అమెరికన్ పౌరుడు తన వంతు సాయం చేస్తాడు. రెండోది పొలిటికల్ యాక్షన్ కమిటీలు. ఇక మూడోది సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీలు (PAC). మొదటి రెండు ఫండ్స్ ద్వారా అంతగా డబ్బులు రాకపోవచ్చు కానీ.. సూపర్ యాక్షన్ పొలిటికల్ కమిటీల (SPAC) ద్వారా లభించే ఫండ్స్ లెక్కలు మన ఊహకు కూడా అందవు. 2010లో అమెరికన్ సుప్రీంకోర్టు ఓ తీర్పు వెల్లడించింది.
సూపర్ పొలిటికల్ యాక్షన్ కమిటీలు ఎన్ని బిలియన్ డాలర్లైనా ఫండ్స్ పోగేయచ్చు కానీ నేరుగా ఎవ్వరితోనూ డీలింగ్స్ చేయకూడదు అని. అంటే కోటీశ్వరులకు చెందిన సంస్థల నుంచి డబ్బులు చేతులు మారుతుంటాయన్నమాట. అయితే ఆ డబ్బులు నేరుగా క్యాష్ రూపంలో ఇవ్వడానికి లేదు. ఏ అభ్యర్ధికి సపోర్ట్ చేయాలనుకుంటారో వారికి యాడ్స్, ప్రచార రూపాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలన్నమాట. అత్యధిక ఖరీదైన ప్రచారం ఏదన్నా ఉందంటే అది మీడియా, యాడ్స్. టీవీల్లో ప్రకటనలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లకు అయ్యే ఖర్చు ఒక్కటే కొన్ని బిలియన్ డాలర్లలో ఉంటుంది.
ఈసారి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తన స్థానంలో కమలా హ్యారిస్‌ను నిలబెట్టాడు. ప్రత్యర్ధిగా డొనాల్డ్ ట్రంప్ పోటీకి దిగారు. ఈసారి కమలా హారిస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అభిప్రాయం.