BRS: DMKని ఫాలో కానున్న పార్టీ.. KCR ప్లాన్ ఇదే
BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి.. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరీ పడిపోయింది. దాంతో అసలు తెలంగాణలో పార్టీ ఉనుకు ఉందా లేదా అనే సందేహాలు మొదలవుతున్నాయి. మరోపక్క పార్టీని బలోపేతం చేసుకోలేక భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేయనుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందిస్తూ.. అందులో ఎంత మాత్రం నిజంలేదని.. భారతీయ జనతా పార్టీలో చేరేది ముందు రేవంత్ రెడ్డే అని ఆరోపించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలించాలని KCR నిర్ణయించారు.
కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్‌లో చెన్నైలో పర్యటించనున్నారు. BRS పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.
తమిళనాడుకు చెందిన DMK తరహాలోనే తమది కూడా ఉద్యమ పార్టీ కావడంతో రెండు పార్టీల నడుమ అనేక సిద్దాంతపరమైన పోలికలు ఉన్నట్లు బీఆర్ఎస్ భావిస్తోంది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన DMK ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని BRS భావిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు DMK సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది.
ఈ నేపథ్యంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.