Twinkle Khanna: నేను చచ్చాక అక్షయ్ రెండో పెళ్లి చేసుకున్నా ఊరుకోను
Twinkle Khanna: తాను చనిపోయాక అక్షయ్ కుమార్ మరో పెళ్లి చేసుకున్నా ఊరుకోనని అన్నారు నటి ట్వింకిల్ ఖన్నా. తెలుగులో విక్టరీ వెంకటేష్‌తో కలిసి శీను సినిమాలో నటించిన ట్వింకిల్.. హిందీలోనూ పలు సినిమాల్లో నటించారు. అయితే తనకు సినిమాలు సూట్ అవ్వవు అని రియలైజ్ అయిన ట్వింకిల్ తనలోని రచయిత్రిని బయటి ప్రపంచానికి పరిచయం చేసారు. అలా ఆమె రాసిన మిసెస్ ఫన్నీ బోన్స్ అనే బుక్ చాలా వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆమె ప్రముఖ ఆంగ్ల ప్రత్రికలకు తనదైన శైలిలో ఆర్టికల్స్ రాస్తున్నారు.
అలా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఈరోజు ఒక వార్త రాసారు ట్వింకిల్. ప్రేమ, పెళ్లి అనే టాపిక్‌పై ఆమె ఆర్టికల్ రాసారు. ఆ ఆర్టికల్‌లో తాను అక్షయ్‌తో కలిసి ఇటీవల ఓ వెకేషన్‌కి వెళ్లానని.. అక్కడ టూరిస్ట్ గైడ్ టిక్ టిక్ అనే పక్షుల గురించి ఆసక్తికరమైన పాయింట్ చెప్పారని పేర్కొన్నారు. టిక్ టిక్ పక్షులు నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపాలని.. రెండు ప్రేమ పక్షుల్లో ఏ ఒక్క పక్షి చనిపోయినా అవి ఆ బాధను భరించలేక విషపూరితమైన గడ్డిని తిని చనిపోతాయని ఆ టూరిస్ట్ గైడ్ చెప్పాడట.
అది విని ట్వింకిల్.. అక్షయ్‌ను ఓ ప్రశ్న అడిగాడట. నేను చనిపోతే నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా? లేక ఆ పక్షిలాగా ఆత్మహత్య చేసుకుంటావా? అని అడిగాడట. ఇందుకు అక్షయ్ ఏమని సమాధానం చెప్పాడో మాత్రం ఆమె వెల్లడించలేదు కానీ.. ఒకవేళ తన చావు తర్వాత అక్షయ్ రెండో పెళ్లి చేసుకుంటే మాత్రం దెయ్యంగా మారి అక్షయ్‌ను అతని రెండో భార్యను కూడా ప్రశాంతంగా బతకనివ్వను అని ఆ ఆర్టికల్‌లో రాసారు.