Balineni Srinivas Reddy: YSRCPకి గుడ్‌బై.. జ‌న‌సేన చుట్టూ ప్ర‌ద‌క్షిణలు

Balineni Srinivas Reddy to join janasena

Balineni Srinivas Reddy: ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. బాలినేని పార్టీలోఉంటారా వెళ్లిపోతారా అనే ప్ర‌శ్న హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓట‌మి త‌ర్వాత బాలినేని త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నార‌ని టాక్. అందుకే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌రిగిన సమీక్ష‌ల‌కు దూరంగా ఉన్నారు. మొన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్‌కి కూడా బాలినేని డుమ్మా కొట్టారు. పార్టీ అధినాయ‌క‌త్వం తీరు ప‌ట్ల అసంతృప్తితో ఉన్నారు.

బాలినేని వైసీపీని వీడితే ప్ర‌కాశం జిల్లాలో పార్టీ ప‌రిస్థితి ఏంటి అనే చ‌ర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలినేని రాజశేఖర్ రెడ్డి చొర‌వ‌తో 1999లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ ద‌క్కించుకుని గెలిచారు. 2004, 2009లోనూ ఈ సీటు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు. వైఎస్సార్ మృతి త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. దాంతో 2012లో ఎమ్మెల్యేగా అన‌ర్హ‌త వేటు ప‌డింది. ఆ త‌ర్వాత ఒంగోలు అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ నేత దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ చేతిలో బాలినేని ఓడిపోయారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్‌పై బాలినేని అసంతృప్తిగా ఉన్నారు.

ఇక‌.. 2019లో వైసీపీ నుంచి గెలిచిన బాలినేని జ‌గ‌న్ క్యాబినెట్ ఫ‌స్ట్‌ హాఫ్‌లో మంత్రిగా ప‌నిచేసారు. మంత్రివ‌ర్గ పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌లో ఆయన్ను ప‌క్క‌న‌పెట్ట‌డంతో ప్ర‌కాశంలో హ‌వా త‌గ్గింది. బాలినేని ఒంటెత్తుపోక‌డ‌లు జ‌గ‌న్‌కు న‌చ్చ‌లేదు. దాంతో బాలినేనికి చెక్ పెట్టి ఆదిమూల‌పు సురేష్ బాప‌ట్ల వేమూరు నుంచి ప్రాతినిథ్యం వ‌హించినా అప్ప‌టి మంత్రి మేరుగు నాగార్జున‌, తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని ప్రోత్స‌హించింది పార్టీ నాయ‌క‌త్వం. ఒంగోలు లోక్‌స‌భ సీటులో చెవిరెడ్డి ఓడిపోయాక కొండ‌పి నుంచి సురేష్‌, సంత‌నూత‌ల‌పాడు నుంచి నాగార్జున పోటీ చేసి ఓడిపోయారు.

జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి న‌చ్చ‌క ప‌లుమార్లు బాలినేని అల‌క‌పాన్పు ఎక్కారు. 2019 ఎన్నిక‌ల్లో టికెట్లు ఇప్పించుకుని త‌న చేతులో బీఫారంలు ఇచ్చిన ఈ నేత 2024 ఎన్నిక‌ల్లో ఒంగోలు వైసీపీ టికెట్ కోసం చేతులు చాచాల్సి వ‌చ్చింది. చివ‌రికి సీటు దక్కించుకుని తెలుగు దేశం పార్టీ అభ్య‌ర్ధితో పోటీప‌డ్డారు. సైకిల్ పార్టీ అభ్య‌ర్ధిపై 34 వేల ఓట్ల‌తో ఓడిపోయారు. ఆ త‌ర్వాత నుంచి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇక వైసీపీకి భ‌విష్య‌త్తు లేద‌ని ఆలోచించిన బాలినేని మెల్లిగా జ‌న‌సేన పార్టీలోకి జంప్ అవ్వాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిచ‌యం ఉన్న సినీ నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ల ద్వారా జ‌న‌సేన‌లో చేరేందుకు బాలినేని పావులు క‌దుపుతున్నారు. ఈ విష‌యంపై ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో ఇప్ప‌టికే ప‌లుమార్లు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అయితే.. ప్ర‌కాశం జిల్లా జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు బాలినేని రాక‌ను వ్య‌తిరేకిస్తున్నారు.