Hyderabad : తెలంగాణలో 146 కోట్ల అంబేడ్క‌ర్ విగ్ర‌హం

Hyderabad : తెలంగాణ రాష్ట్రం(telangana state) హైదరాబాద్‌(hyderabad)లో ఏర్పాటు చేసిన 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహాన్ని(br ambedkar statue) ఆయన జయంతి రోజున అంటే.. ఈ నెల 14న సీఎం కేసీఆర్‌(cm kcr) ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని హుస్సేన్‌ సాగర్‌ పక్కనే దాదాపు 11 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు అంబేడ్కర్‌ విగ్రహం కొలువుదీరడం.. దీనికి సమీపంలోనే తెలంగాణ నూతన సచివాలయ కార్యాలయం ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకత సంతరించుకోనుంది. కేసీఆర్‌ నేతృత్వంలోనే సర్కార్‌ దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించింది. కేవలం స్వదీశీయులు ఈ విగ్రహాన్ని తయారు చేయడం ఇక్కడ మరో ప్రత్యేకత. ఇప్పటికే నూతన సచివాలయ భవనానికి తెలంగాణ సర్కార్ అంబేడ్కర్‌ పేరును పెట్టింది. ఈ విగ్రహం ఏర్పాటుకు దాదాపు 146 కోట్లను ఖర్చుచేసింది. ఇక 14న జరిగే సభలో విగ్రహాన్ని తయారు చేసిన 98 ఏళ్ల రాంవంజీ సుతార్‌(ramvanji suthar)ను సీఎం కేసీఆర్‌ సన్మానించనున్నారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం. దీంతో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 14న జరిగే కార్యక్రమంపై అటు అధికారులు, నాయకులు దృష్టి సారించారు. ఆ రోజు బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు.  దాదాపు రాష్ట్ర నలుమూలల 35 వేల మందిని తరలించేందుకు ఇప్పటికే 750 బస్సులను కేటాయించారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయంతోపాటు, అల్పాహారం, మంచి నీరు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేడ్కర్‌ మునిమనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌ ను పిలుస్తున్నారు. ఇతనితోపాటు సాంప్రదాయబద్దంగా బౌద్దబిక్షువుల సమక్షంలో విగ్రహాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్బంగా విగ్రహంపై నుంచి హెలికాఫ్టర్‌ ద్వారా పూలు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు.. భారీ గజమాలను గులాబీలు, చామంతులు, తమలపాకులతో రూపొందించారు.