Rinku singh: అప్పులు తీరిపోయాయ్!
ఐపీఎల్ (IPL) పుణ్యమా అని.. మట్టిలో మాణిక్యాలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో పాటు వారి జీవితాలను కూడా మార్చేస్తున్నాయి. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉండే వారు, పేదరికంతో సతమతమవుతూ క్రికెట్ఆడాలనే తపన ఉంటే.. వారికి బ్రేక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని ఐపీఎల్(IPL) యాజమాన్యాలు చెబుతున్నాయి. అలా ఐపీఎల్‌తో అరంగ్రేటం చేసి.. భారత జట్టులోకి వచ్చిన వారు ఎందరో క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ పండుగ దేశంలో మొదలైపోయింది. ఇప్పుడున్న కుర్రాళ్లలో ప్రతిభ చూపుతూ అందరి దృష్టిని క్రికెటర్ రింకు సింగ్(rinku singh) ఆకర్షిస్తున్నాడు. ఇతను గత ఏడాది నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) జట్టు తరపున ఆడుతున్నాడు. ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేసే రింకు.. రెండు రోజుల కిందట డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్(gujarat titans)తో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సి రాగా.. అయిదు బంతుల్లో వరుసగా అయిదు సిక్సులు బాది.. జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన రింకు. తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
రింకూది పేద కుటుంబమని.. అతని తండ్రి గ్యాస్ సిలిండర్లను ఇంటింటికీ తీసుకెళ్లే పనిచేసేవారని చెప్పుకొచ్చాడు. మొత్తం అయిదుగురు పిల్లలు కాగా.. అందులో మూడో అబ్బాయే రింకూ. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న రింకూ.. తన సోదరుడితో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు. దీన్ని గమనించిన అతని తండ్రి… తనతోపాటు సిలిండర్లు మోయడానికి రావాలని.. చాలా అప్పులు ఉన్నాయని చెప్పేవాడు. రింకూకి ఆ పని చేయడం ఇష్టం లేదు. ఈ విషయంలో అతని తల్లి మద్దతుగా నిలిచేదట. క్రికెట్ ఆడుకోవడానికి ఆమె ప్రోత్సహించేదని రింకూ చెబుతున్నాడు. ఒకప్పుడు చాలా అప్పులు ఉండేవని.. తాను క్రికెటర్‌గా మారిన తర్వాత.. ఆ అప్పులన్నీ తీర్చినట్లు రింకూ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఐపీఎల్ మీదే ఉందని చెప్పుకొచ్చాడు.