Pawan Kalyan: అందరూ TTD ఛైర్మన్ పదవి అడుగుతున్నారు.. నన్నేం చేయమంటారు?
Pawan Kalyan: జనసేన గెలుపు కోసం పనిచేసిన చాలా మంది నేతలు తనను టీటీడీ ఛైర్మన్ పదవి అడుగుతున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈరోజు జనసేన సైనికులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసారు. ఈనేపథ్యంలో పవన్ వారితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “” చాలా మంది దాదాపు ఛైర్మన్ పదవులు అడుగుతున్నారు. దాదాపు 50 మంది టీటీడీ ఛైర్మన్ పదవి అడుగుతున్నారు. ఇలా అందరికీ ఛైర్మన్ పదవి కావాలంటే నేను మాత్రం ఏం చేయగలను? దేవుడి దయ వల్ల.. నా ఇంట్లో వారు ఎవ్వరూ టిటిడి ఛైర్మన్ పదవి అడగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇలా ఇంట్లో వారికే పదవులు ఇచ్చింది. ఆ సంస్కృతి మన దగ్గర లేకపోవడం మంచి విషయం. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు వద్ద ఎలా చర్చించాలి? అన్నీ మనకే అడిగితే మరి తెలుగు దేశం పార్టీ వారికి ఏమిచ్చుకుంటారు? కాబట్టి అందరూ కాస్త ఆలోచించాలి. మనకు ఆర్ఎస్ఎస్ సంఘం స్ఫూర్తి. ఆ సంఘంలో పనిచేసేవారంతా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తారు కానీ ఏ పదవీ ఆశించరు.
మీరూ అలాగే ఉండాలని కోరుకుంటారు. మీకు పదవి దక్కకపోయినా నా గుండెల్లో చోటు తప్పకుండా దక్కుతుంది. మీకు ఎలాంటి పదవులు కావాలో నిర్మొహమాటంగా నాతో చెప్పండి. నేను కమిటీ సభ్యులతో చర్చించి ఏ నిర్ణయం అనేది చెప్తాను. మనకు చాలా పనులు ఉన్నాయి. దయచేసి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై కామెంట్స్, దాడులకు పాల్పడవద్దు. అది మనకు కొత్త తలనొప్పిని తెస్తుంది. మన పని మనం చేసుకుంటూ పోవాలి. 11 సీట్లు వచ్చిన వారితో మనకేంటి పని “” అని వెల్లడించారు.