Tenth paper leak: బండి సంజయ్‌కు సీపీ రంగనాథ్‍ సవాల్‌!

warangal: హిందీ ప్రశ్నాపత్రం లీక్‌ చేసిన కేసులో ఏ1గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసీఆర్‌ ప్రభుత్వం, అటు వరంగల్‌ సీపీ రంగనాథ్‌పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీంతోపాటు తన ఫోన్‌ ఎవరో కొట్టేశారని. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు. ఇక బండి సంజయ్‌ వ్యాఖ్యలపై వరంగల్‌ సీపీ రంగనాథ్‌ స్పందించారు. తనపైన చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే.. ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని చెబుతున్నారు. తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని వరంగల్ సీపీ స్పష్టం చేశారు. “మేం ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చాం. ప్రతి కేసులో ప్రమాణం చేయమంటే నేను 10 వేల సార్లు చేయాలి. మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేయనివ్వండి. మాల్ ప్రాక్టీస్ కేసును రాజకీయం చేయొద్దు. పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం చేస్తాం. దర్యాప్తు ఏజెన్సీలను బెదిరించే ప్రయత్నం మంచిది కాదు” అని సీపీ పేర్కొన్నారు. దీంతోపాటు తనపై బండి సంజయ్‌ చేస్తున్న సెటిల్‌మెంట్లు, భూదందాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నారు. మరి దీనిపై బండి సంజయ్‌ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా.. కమలాపూర్‌లో హిందీ పరీక్ష పత్రం లీక్ వ్యవహరానికి సంబంధించిన కేసులో.. నిందితులకు కోర్టులో ఊరట లభించింది. ముగ్గురికి మంగళవారం స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ5 శివగణేష్ కు బెయిల్ ఇచ్చింది. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది.