కంబోడియాలో ఇరుక్కున్న భారతీయులు.. నగ్నంగా వీడియో కాల్స్ చేయిస్తూ..
Cambodia: కంబోడియాలో ఉద్యోగాల కోసం వెళ్లిన దాదాపు 3000 మంది భారతీయులు ఇరుక్కుపోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని అక్రమంగా కంబోడియా తరలించారు. వారిలో తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. తెలంగాణకు చెందిన మున్షి ప్రకాష్ అనే బీటెక్ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఉద్యోగం కావాలని పోస్ట్ చేసాడు. ఈ నేపథ్యంలో కంబోడియాకు చెందిన విజయ్ అనే వ్యక్తి నుంచి ప్రకాష్‌కు కాల్ వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తానని అతను నమ్మబలికాడు. ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే ట్రావెల్ హిస్టరీ ఉండాలని చెప్పి ముందు అతనికి మలేసియాకు టికెట్ బుక్ చేసాడు.
ప్రకాష్ మలేషియాలో ల్యాండ్ అవ్వగానే విజయ్ అతన్ని కంబోడియాకు తీసుకెళ్లాడు. అక్కడ విజయ్‌కి ఓ వ్యక్తి 85 వేల డాలర్లు చెల్లించగా అతనికి ప్రకాష్‌ను అప్పగించేసాడు. ఆ తర్వాత అతని పాస్‌పోర్ట్ సీజ్ చేసి అతన్ని ఓ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. ఆ బిల్డింగ్‌లో ప్రకాష్ లాంటి ఎందరో భారతీయులు ఉన్నారు. వారి చేత అమ్మాయిలకు ఫేక్ కాల్స్ చేయించి వారిని మోసం చేసేలా శిక్షణ ఇప్పించారు.
ప్రకాష్‌ను ఓ చీకటి గదిలో పెట్టి చిత్రహింసలకు గురిచేసారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రహస్యంగా తన సోదరికి వీడియో కాల్ చేసి విషయాన్ని చెప్పాడు. దాంతో ఆమె స్థానిక అధికారులను ఆశ్రయించింది. ఆ తర్వాత అధికారులు కంబోడియా పోలీసులను ఆశ్రయించగా వారు ప్రకాష్‌ను కాపాడారు. దాదాపు 3000 మందిని ట్రాప్ చేసారని వారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారని ప్రకాష్ పోలీసులకు చెప్పాడు. ఆడవాళ్ల చేత నగ్నంగా ఫోన్ కాల్స్ చేయించేవారని తెలిపాడు. ఇప్పటివరకు దాదాపు 60 మంది భారతీయులు కంబోడియా నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు.