Murugan: ఉదయాన్నే ఈయన్ని చూస్తే కష్టాలు తీరిపోతాయట..జరిగిన కథ ఇదే
Murugan: చాలా మంది ఫోన్లు, ల్యాప్టాప్స్లలో దేవుళ్ల వాల్పేపర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏ దేవుడు దేవత ఫోటోలు పెట్టుకున్నా మంచిదే కానీ.. సుబ్రహ్మణ్యస్వామి ఫోటోను పెట్టుకుని ఉదయం లేచిన వెంటనే చూసినట్లైతే సగం కష్టాలు తీరిపోతాయట. యదార్థంగా జరిగిన అరుణగిరి నాథన్ అనే అంశం ఈ విషయాన్ని రుజువు చేసింది కూడా. ఆ కథేంటో.. మురుగన్ విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
అరుణాచలంలో ఓ దేవదాసి ఉండేది. ఆవిడకి ఒక బాబు, పాప పుట్టారు. వీరిద్దరూ చిన్నగా ఉన్నప్పుడు ఆ దేవదాసి చనిపోయింది. ఆమె చనిపోతూ తమ్ముడి బాధ్యత నీదే అని పాపకు చెప్పి తనువు చాలించింది. అలా తల్లి చనిపోవడంతో పాపే తమ్ముడిని పెంచుకుంటూ ఉంటుంది. అతని పేరు అరుణగిరినాథన్ కానీ ఆ అరుణగిరినాథన్ మాత్రం రకరకాల వ్యసనాలకు బానిసవుతాడు. స్త్రీల వద్దకు వెళ్లడం.. జూదాలకు అలవాటు పడటం ఇలా అతనికి లేని చెడు అలవాటంటూ లేదు.
ఓసారి అరుణగిరినాథన్ తన అక్క దగ్గరికి వెళ్లి డబ్బులు కావాలని గొడవ చేస్తాడు. ఇంట్లో డబ్బులన్నీ జూదం ఆడటానికే తగలబెట్టావు. ఇప్పుడు తినడానికి కూడా లేవు. అయినా ఇప్పుడు నీకు డబ్బులు కావాల్సింది మరో స్త్రీని అనుభవించడానికే కదా అని తమ్ముడికి ఓ మాట చెప్తుంది. మన ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టాం. కానీ తండ్రి ఎవరో తెలీదు. అలాంటప్పుడు మరో స్త్రీ వద్దకు వెళ్లడం ఎందుకు అదేదో నన్నే అనుభవించు అని చెప్తుంది.
అది విన్నాక ఆ అరుణగిరినాథన్.. ఛీ నేను మరీ ఇంత దిగజారిపోయానా అని తన మీద తనకే అసహ్యం కలుగుతుంది. దాంతో అరుణాచలంలోని ఓ గిరి మీదకు ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. అలా గిరి మీద నుంచి దూకుతూ మురుగా.. అని అరిచి దూకేస్తాడు. అప్పుడు మురుగన్ (సుబ్రహ్మణ్యస్వామి) అతన్ని పట్టుకుని కాపాడతాడు. అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. అంటే.. పశ్చాత్తాపంతో ఎప్పుడైతే చేసిన తప్పుకి బాధపడుతుంటారో అప్పుడు స్వయంగా భగవంతుడే కనిపించి కనికరిస్తాడని అర్థం.
అప్పుడు అరుణగిరినాథన్ నాలుకపై సుబ్రహ్మణ్యస్వామి జటాక్షరీ మంత్రాన్ని లిఖిస్తాడు. అక్కడి నుంచి ఆ వ్యక్తి జీవితమే మారిపోయింది. అప్పటి నుంచి అతను దాదాపు 16 వేల శ్లోకాలు రాసాడట. ఈ విషయం తెలిసి ఆ ఊరి రాజు అతన్ని పిలిపించి ఆస్థాన కవిగా నియమిస్తాడు. అలా అతను కవిత్వాలు చెప్పుకుంటూ మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఓసారి ఆ రాజు అతని వద్దకు వెళ్లి మీరు జపం చేస్తే సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తాడట కదా.. ఓసారి నాకు చూపిస్తారా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి సరే అంటాడు.
అలా జపం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తాడు. స్వామీ.. మా రాజుల వారు మిమ్మల్ని చూడాలని అంటున్నాడు. ఆయనకి కూడా కనిపించండి అని అరుణగిరినాథన్ ప్రాథేయపడతాడు. అప్పుడు ఆ స్వామి.. లేదు అతను నన్ను చూడలేడు అంటాడు. ఒకసారి కనిపించండి స్వామీ సంతోషిస్తాడు అని కోరగా ఆ రాజుకి కూడా కొన్ని వందల అడుగుల ఎత్తులో సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తాడు. దాంతో స్వామిని చూడలేక ఆ రాజు కళ్లుపోతాయి. అయ్యో నా కళ్లుపోయాయి అంటూ రాజు ఏడుస్తాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామిని ఆ రాజు వేడుకోగా.. అతను చూసేంత సైజులోకి మారిపోయి దర్శనమిచ్చి కళ్లు వచ్చేలా చేస్తాడు.
అరుణగిరినాథన్కి పరకాయ ప్రవేశం చేయడం తెలుసు. పరకాయ ప్రవేశం అంటే తన శరీరాన్ని వదిలి మరో జీవిలోకి ప్రవేశించడం. అలా ఓరోజు అరుణగిరినాథన్ పక్షి శరీరంలోకి ప్రవేశిస్తాడు. అలా పక్షిలా మారి వివిధ పర్వాతాల్లో పూసే ఎర్రటి పువ్వులను తెచ్చి సుబ్రహ్మణ్యస్వామి ఆరాధాన చేసేవాడు. ఈ నేపథ్యంలో రాజు ఆ అరుణగిరినాథన్తో సన్నిహితంగా ఉంటున్నాడని నచ్చని ఓ వ్యక్తి.. అరుణగిరినాథన్ పరకాయ ప్రవేశం చేసాడని తెలిసి అతని శరీరాన్ని కాల్చేస్తాడు. దాంతో పాపం అరుణగిరినాథన్ పక్షి రూపంలోనే మిగిలిపోయి అరుణాచలంలో మురుగన్ను పూజిస్తూ ఉండిపోయాడని ఇప్పటికీ చెప్తుంటారు.
ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఎక్కడ పనికొస్తుందంటే.. ఇంట్లో చెడు అలవాట్లకు బానిసైన వారు మురుగన్ను పూజిస్తే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అసలు మురుగన్ను ఫోన్ వాల్పేపర్లో పెట్టుకుని ఉదయం లేవగానే చూసినా ఎంతో మంచిదని.. కష్టాలన్నీ తీరుస్తాడని చెప్తుంటారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శన ప్రియుడు. అంటే అతన్ని చూస్తే చాలు ప్రీతిచెందుతాడట.