Sunita Williams: స్పేస్ స్టేషన్‌లో ఇరుక్కుపోయిన సునితా విలియమ్స్.. తగ్గిపోతున్న ఆక్సిజన్
Sunita Williams: ప్రముఖ భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయారు. ఆమెతో పాటు కొలీగ్ బుచ్ విల్మోర్ కూడా ఆ స్టేషన్‌లో ఇరుక్కున్నారు. భూమికి రిటర్న్ అయ్యే మిషన్ ఆలస్యం అవడంతో దాదాపు పది రోజులుగా వారు స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుని ఉన్నారు. వారిద్దరూ జూన్ 13న భూమి పైకి రావాల్సి ఉంది. కానీ అది పలుమార్లు వాయిదా పడటంతో జులై 2వ తారీఖున వస్తారని అంటున్నారు. కానీ అది కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో హీలియం గ్యాస్ లీక్ అవడంతో ఈ ఆలస్యం ఏర్పడింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను బోయింగ్ నిర్మించింది. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు సునీత వెళ్లడానికి ముందే హీలియం గ్యాస్ లీక్ అవుతోందన్న విషయం నాసాకు బోయింగ్ సంస్థలకు తెలుసు. కానీ దాని వల్ల పెద్ద ప్రమాదమేమీ ఉండదు అన్న నిర్లక్ష్యంతో వారిని స్పేస్ స్టేషన్‌కు పంపించేసారు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం కొంపముంచేలా ఉందని భయపడుతున్నారు. స్పేస్‌క్రాఫ్ట్ ఆర్బిట్‌లోకి ప్రవేశించగానే మరో నాలుగు వైపుల నుంచి హీలియం లీక్ అవడం మొదలుపెట్టింది. దాంతో ఒక థ్రస్టర్ పనిచేయడం ఆగిపోయింది. దాంతో అసలు ఆ స్పేస్‌క్రాఫ్ట్ సురక్షితంగా భూమిపైకి వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోపక్క వ్యోమగాములు స్పేస్‌క్రాఫ్ట్‌లో చిక్కుకోలేదని వారికి కావాల్సినప్పుడు భూమిపైకి సురక్షితంగా వచ్చే అవకాశం ఉందని నాసా చెప్తోంది. ఈ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను రూపొందించిన బోయింగ్‌పై చాలా మంది మండిపడుతున్నారు. ఆల్రెడీ ఓ బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సమస్యలు వచ్చినప్పుడు పరిశీలించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోకుండా స్పేస్‌క్రాఫ్ట్‌ను హడావిడిగా రూపొందించారని శాపనార్థాలు పెడుతున్నారు. ఈ స్టార్‌లైనర్‌ను రూపొందించేందుకు బోయింగ్ నాసాతో కుదుర్చుకున్న ఒప్పందం ఖరీదు 4.5 బిలియన్ డాలర్లు. ఇవి చాలవన్నట్లు మరో 1.5 బిలియన్ డాలర్లు కూడా కావాలని కోరింది. ఎంత అడిగినా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా స్టార్‌లైనర్‌ను రూపొందించలేకపోయింది బోయింగ్.
ఈ నేపథ్యంలో బోయింగ్ సంస్థపై క్రిమినల్ చార్జీలు నమోదయ్యాయి. జులై 7 తర్వాత బోయింగ్ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అమెరికన్ ప్రాసిక్యూటర్లు నిర్ణయిస్తారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రస్తుతం సునితా విలియమ్స్ ఉన్న ఈ స్టార్‌లింక్ స్పేస్‌క్రాఫ్ట్‌లో కేవలం 26 రోజులకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది. అది అయిపోయేలోపు ఆమె భూమిపైకి సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిద్దాం.