పిల్లలకు పెళ్లి అవ్వాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పరిహారాలేంటి?
Spiritual: పిల్లలకు పెళ్లిళ్లు కావడంలేదని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటారు. వారి కోసం ఎన్నో ఆలయాలు తిరుగుతూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. పిల్లలు ఒక మంత్రం జపిస్తే వారికి పెళ్లి అవుతందని అని ఎవరైనా చెప్పినా.. ఆ పిల్లలు ఒకటి రెండు రోజులు చేసి ఆ తర్వాత మంత్రం జపించడం మానేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో అంత సేపు కూర్చుని జపం చేసే టైం ఓపిక ఎవరికీ లేవు. పిల్లలకు జపం చేసే సమయం లేనప్పుడు వారి కోసం తల్లిదండ్రులు ఏమైనా చేయొచ్చా? అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం.
రామాయణంలో కళ్యాణ సర్గ అని ఉంటుంది. ఈ కళ్యాణ సర్గను 41 రోజులు పారాయణం చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ సర్గను తల్లిదండ్రులే చేయాలని లేదు. పెళ్లికాని వారు ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ సర్గ చదివే సమయం లేదు అనుకునేవారు.. ఆర్థిక స్తోమత ఉన్నట్లైతే ఓ పండితుడిని పిలిపించుకుని సర్గ పారాయణం చేయించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే సరిపోతుంది.
ఇక రెండోది ఏంటంటే.. లక్ష్మీనారాయణ కళ్యాణ శాంతి అని ఉంటుంది. ఇది చదివినా మంచిదే. ఇది కూడా ఎవరికి వారు చదువుకోవచ్చు లేదా పండితుడి ద్వారా చదివించుకోవచ్చు.
ఇక మూడోది ఏంటంటే.. స్త్రీ సూక్త పురుష సూక్తంతో హోమం చేసుకోవాలి. ఇది అంత సులువుగా చేయలేనిది. ఈ హోమం చేయించుకునేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని కొన్ని అంశాలు ఉంటాయి. కచ్చితంగా నియమాలను పాటించాల్సి ఉంటుంది. మొట్ట మొదటి నియమం ఏంటంటే.. ఇంట్లో పొరపాటున కూడా కోపతాపాలు, గొడవలు, చిరాకులు, ఏడుపులు పెడబొబ్బులు వంటివి ఉండకూడదు. సర్గలు చదువుతున్నప్పుడు కానీ హోమం జరుగుతున్నప్పుడు కానీ అరవడాలు కేకలు వేయడాలు కోపాలు తెచ్చుకోవడాలు వంటివి చేస్తే ఫలితం మాత్రం రాదు.
చాలా మంది ఎంతో ఘనంగా పూజలు చేయిస్తారు కానీ వారికి ఫలితం రాకపోవడానికి కారణం ఇదేనట. కాబట్టి పూజలు, హోమాలు, జపాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదు.