Dasara: రీమేక్ చేసేస్తున్నారు బాబోయ్..!
Hyderabad: నేచురల్ స్టార్ నాని(Nani), కీర్తి సురేష్ (Keerthy suresh) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా దసరా’(Dasara). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతే కాదు, సుమారుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లోకీ చేరిపోయింది.
ఓవర్సీస్లోనూ 2 మిలియన్ డాలర్ల మార్క్‌కి చేరువై రికార్డులు సృష్టించింది. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కింది. విడుదలైన పది రోజులు దాటినా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి షేర్స్‌తో దుమ్ములేపుతోంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం,మలయాళం, కన్నడ భాషలలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. కానీ ఆ భాషల నుండి చెప్పుకోదగిన కలెక్షన్స్ రాలేదు. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాని ఉత్తరాదిన ముంబై, లక్నో వంటి పట్టణాల్లోనూ పర్యటించారు. కానీ అక్కడ అంతగా సినిమా వర్కౌట్ అవలేదు.
అయితే ఈ సినిమాపై ఇప్పుడు బాలీవుడ్(Bollywood) కన్నుపడింది. సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్(Amir Khan)కు సినిమా ఎంతో నచ్చిందట. అందుకే దీనిని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’(Lal Singh Chadda). ఇది బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni NagaChaitanya) కూడా నటించారు.
కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమిర్ సరైన కథ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈసారి స్క్రిప్ట్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు. సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘దసరా’ ఆయనని ఎంతగానో ఆకట్టుకుందట. మరి దంగల్ (Dangal) తర్వాత సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న అమిర్ ఖాన్ కెరీర్ లో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.