YS Sharmila: ప్ర‌జ‌లు క‌సితో ఓటేసారు కాబ‌ట్టే జ‌గ‌న్ ఓడాడు

YS Sharmila says ap people voted out of vengeance

YS Sharmila:  ఈసారి ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లు మార్పు కావాలి అన్న ఒకే ఒక్క నిర్ణ‌యంతో ఎంతో క‌సిగా ఓటు వేసార‌ని.. అందుకే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఓడిపోయాడ‌ని అన్నారు APCC చీఫ్ వైఎస్ ష‌ర్మిళ‌. క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక ష‌ర్మ‌ళ తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చారు. ప్ర‌భుత్వం మారాలి బ‌తుకులు మారాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్‌కు కూడా ఓటు వేయ‌లేద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ కాంగ్రెస్ పట్ల జ‌నాల్లో కాస్త న‌మ్మ‌కం క‌లిగింద‌ని ఇది 2029 నాటికి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె తెలిపారు.

ఇక‌పోతే.. చంద్ర‌బాబు నాయుడు న‌రేంద్ర మోదీతో చేతులు క‌లిపారు కాబ‌ట్టి క‌చ్చితంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అడ‌గాల్సిందేన‌ని.. ఎందుకంటే 400 సీట్లు వ‌స్తాయ‌ని ఎగిరిన ఎన్డీయే కూట‌మి కాంగ్రెస్ దెబ్బ‌కు మెజారిటీని కూడా ద‌క్కించుకోలేని స్థితికి చేరుకుంద‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు స‌పోర్ట్ చేస్తున్నారు కాబ‌ట్టే మోదీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చార‌ని అన్నారు. ఈ విష‌యాన్ని మోదీ కూడా గుర్తుపెట్టుకుని ప‌దేళ్లుగా ఏపీ ప్ర‌జ‌లు అడుగుతున్న ప్ర‌త్యేక హోదాను ఇవ్వాల‌ని ఆమె కోరారు. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు నాయుడుకు కూడా గుర్తు చేసారు.