జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. భర్త మర్డర్.. ప్రియుడితో ట్రిప్.. సినిమా స్టోరీని తలపిస్తున్న కేసు
Viral News: సినిమాల్లోని హత్య కేసులను ఆధారంగా చేసుకుని హత్యలకు పాల్పడే వాళ్ల గురించి విన్నాం. కానీ ఈ ఘటనను మాత్రం సినిమాలో వాడితే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోతుందనే చెప్పాలి. ఆ రేంజ్లో ఉన్నాయి ఈ కేసు వివరాలు మరి.
పై ఫోటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు నిధి, వినోద్. వీరిది హరియాణాలోని పానిపట్. వినోద్ స్థానికంగా పేరుగాంచిన వ్యాపారవేత్త. అయితే మూడేళ్ల క్రితం నిధి ఓ జిమ్‌లో చేరింది. ఆ సమయంలో సుమిత్ అనే ట్రైనర్ నిధికి పరిచయం అయ్యాడు. క్రమంగా వీరి మధ్య స్నేహం పెరిగి అది ఎఫైర్‌కు దారి తీసింది. ఈ విషయం వినోద్‌కు తెలీడంతో పలుమార్లు నిధిని హెచ్చరించాడు. దాంతో ఎలాగైనా వినోద్‌ను చంపేసి తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిధి, సుమిత్‌లు పన్నాగం వేసారు. ఈ నేపథ్యంలో 2021లో వినోద్‌ను ఓ కారు ఢీకొట్టింది.
ఆ సమయంలో అతను గాయాలతో బయటపడ్డాడు. ఆ సమయంలో కారు నడిపింది దేవ్ అనే వ్యక్తి. దాంతో అతనిపై వినోద్ కేసు వేసాడు. అయితే ఎక్కడ తనకు శిక్ష పడుతుందో అని దేవ్ వినోద్‌కు కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో పలు మార్లు వినోద్‌ను కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ వినోద్ ఒప్పుకోలేదు. దాంతో కోపంతో దేవ్ వినోద్‌ను గన్నుతో కాల్చి చంపేసాడు.
ఆ తర్వాత దేవ్‌ను జైలుకు తరలించారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న మృతుడి సోదరుడు హరియాణా డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ అజిత్ సింగ్‌కి ఓ మెసేజ్ పంపాడు. తన సోదరుడు వినోద్ హత్య కేసులో ఇంకేదో లొసుగు దాగి ఉందనిపిస్తోందని.. ఇంకోసారి కేసును విచారణ చేయాలని కోరాడు. అజిత్ సింగ్‌కి కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక హిట్ అండ్ రన్ కేసు కోసం వినోద్‌ని చంపడంలో అర్థంలేదు. ఎందుకంటే వినోద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి మహా అంటే ఆరు నెలలు జైలు శిక్ష లేదంటే భారీ మొత్తంలో జరిమానా మాత్రమే విధిస్తారు. ఆ మాత్రం దానికే వినోద్‌ను చంపేస్తాడా? అని అజిత్ సింగ్‌కి కూడా అనుమానం వచ్చింది.
ఇందుకోసం హరియాణాకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన అధికారి దీపక్ కుమార్‌కు అజిత్ సింగ్ ఈ కేసును అప్పగించాడు. దీపక్ కుమార్ కేసు విచారణ చేపడుతుండగా.. వినోద్ భార్య నిధికి జిమ్ ట్రైనర్ అయిన సుమిత్‌కి మధ్య ఉన్న ఎఫైర్ బయటపడింది. అనుమానంతో వారిద్దరినీ అరెస్ట్ చేయగా.. తమ ఎఫైర్‌కు అడ్డుపడుతున్నాడని తానే దేవ్ అనే వ్యక్తికి రూ.10 లక్షలు సుపారీ ఇచ్చి యాక్సిడెంట్ చేయించానని.. కానీ ఆ యాక్సిడెంట్లో బతికిపోవడంతో కోర్టు బయట సెటిల్మెంట్ పేరుతో పిలిపించి గన్నుతో షూట్ చేయించానని ఒప్పుకుంది. అది విని పోలీసులు కూడా షాకయ్యారు. వెంటనే నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.