Lifestyle: పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు చెల్లి అంటున్నాడు
Lifestyle: నాది విచిత్రమైన సమస్య. బహుశా ఇలాంటి సమస్య మరే ఆడదానికి వచ్చి ఉండదు అనుకుంటున్నాను. నాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. మేం గుజరాత్లో స్థిరపడ్డాం. ఈ మధ్యకాలంలో నా భర్త వింత ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేను ఆయన భార్యను అన్న విషయం మర్చిపోయి ఒక్కోసారి చెల్లెమ్మా అని పిలుస్తున్నారు. మొదట్లో ఆయన నన్ను చెల్లెమ్మా అంటుంటే ఏదో ఆటపట్టిస్తున్నారునే అనుకున్నాను. దాంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ మా అమ్మానాన్నలు వచ్చినప్పుడు.. నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు కూడా మా చెల్లి వంట బాగా చేస్తుంది అని చెప్పడం విన్నాను. మా అమ్మానాన్నలు ముందు సరదాగా ఏదో అని ఉంటాడు అనుకున్నారు కానీ ఇప్పుడు వారు కూడా కంగారుపడుతున్నారు. నాకు మా వారితో కలిసి నిద్రపోవాలంటే భయం వేస్తోంది. ఆయన చేష్టల వల్ల కలిసి బయటికి కూడా వెళ్లలేకపోతున్నాను. ఏదన్నా పరిష్కారం చూపగలరు.
నిపుణుల సలహా
మీ బాధ అర్థమైంది. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీ వారికి మానసిక రుగ్మత ఉన్నట్లు అనిపిస్తోంది. మీ వారు మిమ్మల్ని చెల్లి అని సంబోధిస్తున్నారని అంటున్నారు. ఆయనకు సొంత చెల్లెలు ఉందా అన్న విషయం మాత్రం మీరు రాయలేదు. ఒకవేళ చెల్లి కానీ ఉండి ఉంటే మీరు అచ్చం ఆమెలా నడుచుకుంటున్నారనో.. ఆమెలా వండుతున్నారనో ఇతరులకు చెప్తున్నారని అనుకోవచ్చు. ఓసారి మీ వారితో ఈ విషయం గురించి మాట్లాడి చూడండి. ఎందుకు అలా అంటున్నారో మెల్లిగా అడిగి చూడండి. అలా అనడం వల్ల నలుగురూ ఏమనుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆయనలో మార్పు రాకపోతే కౌన్సిలింగ్ ఇప్పించడం నయం.