మంచితనం కాదు.. కేవలం నటన.. ముంబై ఫోటోగ్రాఫర్ అనుచిత వ్యాఖ్యలు
Varinder Chawla: టాలీవుడ్ స్టార్ నటులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలపై ముంబైకి చెందిన ఓ ఫేమస్ ఫోటోగ్రాఫర్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. వరీందర్ చావ్లా అనే ఫేమస్ ముంబై ఫోటోగ్రాఫర్ వీరి ముగ్గురి అసలు స్వరూపం వేరే ఉందని.. పైకి తామెంతో మంచివారిమని నటిస్తున్నారని.. అసలు రూపం తాను తన కళ్లతో చూసానని అంటున్నాడు.
లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ముంబై వెళ్లాడు. ఆ సమయంలో అతను చెప్పులు వేసుకోలేదు. దాంతో అంతా విజయ్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ అంటూ గొప్పగా చెప్పుకున్నారు. అది కేవలం సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి చేసిన ప్రమోషన్ మాత్రమే అని వరీందర్ ఆరోపించాడు.
ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్లో నటిస్తారా అని ఓ సందర్భంలో అడిగిన ప్రశ్నకు మహేష్ పొగరుగా సమాధానం ఇచ్చారని.. దానిని అందరూ కాన్ఫిడెన్స్ అనుకున్నారు కానీ అది మరో చిత్ర పరిశ్రమను తక్కువ చేసినట్లే అని వరీందర్ అంటున్నాడు. నేను టాలీవుడ్లోనే ఉంటాను. నేను బాలీవుడ్‌కి వెళ్తే నాపై పెట్టుబడి పెట్టేంత స్తోమత వారికి లేదు అని మహేష్ అన్నారు. దీనిని వీరందర్ చావ్లా ఉదాహరణగా చెప్తూ బాలీవుడ్‌పై కావాలని విషం చిమ్ముతున్నారని ఆరోపణలు చేసాడు.
వార్ 2 సినిమాలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ముంబై వెళ్లారు. ఆ సమయంలో ఆయన హోటల్లోకి వెళ్తుంటే ముంబైకి చెందిన ఫోటోగ్రాఫర్లు ఆయనతో పాటు హోటల్లోకి వెళ్లేందుకు యత్నించారు. అప్పుడు తారక్.. ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని విసుక్కున్నారు. ఈ మూడు ఉదాహరణలు చెప్తూ టాలీవుడ్ నటీనటుల అసలు స్వరూపం వేరుందని.. మాటి మాటికీ బాలీవుడ్ వాళ్లు టాలీవుడ్ వారిని చూసి నేర్చుకోవాలని చెప్తుంటారని అందులో ఏమాత్రం నిజం లేదని వరీందర్ అంటున్నారు.